Finland : తెలుగుదేశం ప్రభుత్వం విద్యా రంగాన్ని సమూలంగా మార్చేందుకు దృఢ సంకల్పంతో ఉందని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ ఏ.ఎస్. రామకృష్ణ స్పష్టం చేశారు. బుధవారం నాడు ఫిన్‌లాండ్ రాజధాని హెల్సింకిలో జరిగిన తెలుగు సంఘాలు మరియు తెలుగుదేశం పార్టీ అభిమానుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ, ప్రపంచంలోనే విద్యా రంగంలో అగ్రస్థానంలో ఉన్న ఫిన్‌లాండ్‌ను సందర్శించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. విద్యారంగంలోనే కాకుండా సంతోష సూచీ (హ్యాపీనెస్ ఇండెక్స్)లో కూడా ఫిన్‌లాండ్ ముందు వరుసలో నిలవడం గర్వకారణమన్నారు. చంద్రబాబు నాయుడు సారథ్యంలోని తెలుగుదేశం ప్రభుత్వం విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి నిరంతరం కృషి చేస్తోందని ఆయన వివరించారు.
మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ, చిన్న వయస్సులోనే మార్కులు, ర్యాంకులు, డబ్బుల కంటే విలువలతో కూడిన విద్యకు ఫిన్‌లాండ్ ఇస్తున్న ప్రాధాన్యత అభినందనీయమన్నారు. ఈ విధానం విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి దోహదం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఫిన్‌లాండ్ తెలుగు సంఘం అధ్యక్షుడు కాకర్ల రమేష్ మరియు ఫిన్లండ్ కల్చరల్ అసోసియేషన్ స్పోర్ట్స్ అధ్యక్షుడు రామకృష్ణ వెలగపూడి ఈ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వెంగళరావు సాధినేని, శ్రీనివాస్ నాగబోయిన, రమేష్ శరణు, సుధాకర్ చల్లగుంట్ల, నక్కా కిషోర్, సుదర్శన్ బాబు నాగినేని తదితర ప్రముఖులు మరియు తెదేపా అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఫిన్‌లాండ్‌లో ఉన్న తెలుగువారు తమ మద్దతును తెదేపా ప్రభుత్వానికి తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో విద్యా రంగంలో మరిన్ని సంస్కరణలు చూడాలని ఆకాంక్షించారు.