
TDP & Janasena Alliance :
ఏపీలో టీడీపీ, జనసేన పార్టీల పొత్తు ఖరారైంది. అధికార వైసీపీ ఆగడాలను ఎదుర్కొనేందుకు కలిసి వెళ్లాలని ఇరు పార్టీల అధినేతలు నిర్ణయించారు. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తుపై అధికారిక ప్రకటన చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అభియోగాలు మోపుతూ చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆయనను రాజమండ్రి జైలులో పవన్ కలిశారు. ములాఖత్ అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్ లో పొత్తుపై ప్రకటన చేశారు.
ఇక మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం కూడా జనసేనాని నిర్వహించారు. టీడీపీ తో పొత్తు ఆవశ్యకతను వారికి వివరించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోమని కొంతకాలంగా చెబుతున్న పవన్, అధికార పార్టీని ఎదుర్కోవాలంటే సమష్టిగా వెళ్లాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇక ఎలాంటి ఇగోలు అవసరం లేదని, టీడీపీ నాయకులను కలుపుకొని వెళ్లాలని సూచించారు. దీంతో పాటు పొత్తులపై చర్చలకు ఇప్పటికే సమన్వయ కమిటీ మెంబర్ గా నాదెండ్ల మనోహర్ ను ప్రకటించారు.
ఇక సమన్వయ కమిటీల ఏర్పాటు పై జనసేనాని కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే దీనిమీద ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. మరోవైపు టీడీపీ నేత లోకేశ్ కూడా దీనిపై నిర్ణయం తీసుకోబోతున్నారు. రాజమండ్రి జైలులో ఉన్న అధినేత చంద్రబాబును కలిసిన అనంతరం ఆయన సమన్వయ కమిటీలో ఎవురు ఉంటారనే నిర్ణయం ప్రకటించనున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఈ రోజు రాజమండ్రి చేరుకోనున్నారు. తదనంతరం అధినేత ను కలిసి జనసేనతో సమన్వయ కమిటీ ని ప్రకటించే అవకాశం ఉంది.