TDP Leader : అన్నమయ్య జిల్లా హార్సిలీ హిల్స్‌లో టీడీపీ కార్యకర్తల సమావేశంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తంబళ్లపల్లి నియోజకవర్గంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ వర్గం, ఇంఛార్జ్ జయచంద్రారెడ్డి వర్గం నేతల మధ్య వాగ్వాదం తీవ్రరూపం దాల్చింది.
మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రాజు సమక్షంలోనే నేతలు పరస్పరం చొక్కాలు పట్టుకుని కొట్టుకునే వరకు వెళ్ళారు. ఈ ఘటన జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి ఎదుటే జరగడం గమనార్హం.
ప్రముఖ పర్యాటక కేంద్రమైన హార్సిలీ హిల్స్ లో ఏర్పాటు చేసిన సమావేశానికి పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. కార్యకర్తలతో మండలాల వారీగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమావేశం నిర్వహిస్తుండగానే ఇద్దరు వర్గాలు నినాదాలతో ఒకరిపై ఒకరు దాడికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటన టీడీపీ లోపలి విభేదాలు మరోసారి వెలుగులోకి తెచ్చింది.