
TDP Nara Lokesh : టీడీపీ యువనేత లోకేశ్ యువగళం పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పాదయాత్ర రాయలసీమలోని కడప జిల్లాలో కొనసాగుతున్నది. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ యువనేత పాదయాత్రకు అనూహ్య స్పందన వస్తున్నది. టీడీపీ కి పూర్వ వైభవం.. పార్టీని మరోసారి అధికారంలోకి తేవడమే లక్ష్యంగా యువనేత 4వేల కిలోమీటర్ల పాదయాత్రకు శ్రీకారం చుట్టాడు. ఇప్పటికే 1500 కిలో మీటర్ల పాదయాత్ర పూర్తయింది.
అయితే రానున్న ఎన్నికలే లక్ష్యంగా అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాల ప్రజలను ఆకట్టుకునేందుకు యువనేత ప్రయత్నిస్తున్నారు. మిషన్ రాయలసీమ పేరిట తమ పార్టీ చేపట్టే కార్యక్రమాలను వివరిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే హర్టికల్చర్ హబ్ గా రాయలసీమను తీర్చిదిద్దుతామని యువనేత ప్రకటించారు. సీమలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరందించే లక్ష్యంతో ముందుకెళ్తామనిచెప్పారు. పండ్ల తోటల రైతులకు ప్రోత్సహాన్ని అందిస్తామని హామినిచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో ఉత్పత్తులు ఎగుమతులు చేసేలా రాయలసీమ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతామని చెప్పారు. ప్రత్యేకంగా పరిశోధనా కేంద్రాలను ఇక్కడ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. వ్యవసాయ రంగంలో రాయలసీమను అగ్రపథాన నిలిపి, సీడ్ హబ్ ను కూడా ఏర్పాటు చేస్తామని, టమాట వాల్యూ చైన్ ఏర్పాటు చేస్తామని తెలపారు. అయితే పెట్టుబడులు తగ్గించి, దిగుబడులు పెంచేలా రైతాంగానికి పూర్తి అండగా నిలుస్తామని తెలిపారు.
2024 ఎన్నికలే లక్ష్యంగా యువనేత లోకేశ్ పాదయాత్ర చేస్తున్నాడు. ప్రస్తుతం సీఎం సొంత జిల్లా కడపలో ఆయన ఉన్నారు. అయితే ఇక్కడి నుంచే రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించాలని ఆయన భావించారు. ముందు నుంచి కడప జిల్లా వైఎస్ కుటుంబానికి అండగా నిలుస్తూ వస్తున్నది. అయితే ఇక్కడ టీడీపీ కి పట్టు దక్కితే ఇక తిరుగుండదని లోకేశ్ భావిస్తున్నారు. అందుకే రాయలసీమలో రైతులను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. సాగునీటి రంగంలో కొంత వెనుకబడి ఉన్న రాయలసీమకు జలాలు పారిస్తే ఇక తిరుగుండదని ఆయన భావిస్తున్నారు. అయితే తాము అధికారంలోకి వస్తే రాయలసీమపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అభివృద్ధిని కొనసాగిస్తామని చెబుతున్నారు. అధినేత చంద్రబాబు సూచనల మేరకు పలు ప్రకటనలు చేస్తున్నారు. టీడీపీకి అండగా నిలవాలని రాయలసీమ ప్రజలను కోరుతున్నారు. ఇప్పటివరకు లోకేశ్ పర్యటనకు భారీ స్పందన వచ్చింది. మరోవైపు ఆయా వర్గాల ప్రజలను కూడా లోకేశ్ కలుసుకుంటున్నారు. గతంలో జగన్ ఇలాగే పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి నేనున్నా.. నేను విన్నా అంటూ ప్రజలను తనవైపు తిప్పుకున్నారు. తెలుగు రాష్ర్టాల్లో పాదయాత్రలే కీలకం. గతంలో చంద్రబాబు, వైఎస్, జగన్ ఇలా పాదయాత్రలు చేసే ప్రజలను తమ వైపు తిప్పుకున్నారు. ఇప్పుడు లోకేశ్ కూడా అదేరీతిలో పాదయాత్ర చేస్తున్నారు.






