Team India Number one : మొహాలీలోని పీసీఏ IS బింద్రా స్టేడియంలో ఆస్ట్రేలియాపై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన తర్వాత ఐసీసీ వన్డే టీమ్ ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ ను కిందికి నెట్టి భారత పురుషుల క్రికెట్ జట్టు అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పుడు అరుదైన రీతిలో మూడు ఫార్మాట్లలోనూ భారత్ నంబర్ ర్యాంకింగ్స్‌లో ఆధిపత్యం సాధించింది. ఇది చారిత్రాత్మక ఫీట్. క్రికెట్ చరిత్రలో దక్షిణాఫ్రికా తర్వాత ఈ మైలురాయిని నమోదు చేసిన రెండో జట్టుగా టీమిండియా నిలిచింది.
భారతదేశం, పాకిస్తాన్, ఆస్ట్రేలియా రాబోయే ప్రపంచ కప్ 2023కి ముందు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని సాధించంచేందుకు పోటీలో ఉన్నాయి. ఆసియా కప్ 2023 ఫైనల్‌లో విఫలమైనప్పటికీ పాకిస్తాన్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కొనసాగించింది. కానీ కాంటినెంటల్ టోర్నమెంట్‌లో భారత్ విజయం అంతరాన్ని తగ్గించడానికి, రెండో స్థానానికి చేరుకోవడానికి సహాయపడింది. ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి ODI మ్యాచ్‌కు ముందు మెన్ ఇన్ బ్లూ 115 పాయింట్లతో పాకిస్థాన్‌తో సమానంగా ఉంది. ఈ మ్యాచ్ లో గెలుపొందడంతో 116 పాయింట్లతో అగ్ర స్థానానికి చేరుకుంది.టెస్టుల్లో, భారత జట్టు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 118 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆస్ట్రేలియాతో ఒక స్థాయిలో ఉంది. టీ20లలో 264 పాయింట్లతో ఆధిపత్యం చెలాయిస్తుంది. రెండో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ జట్టు కంటే మూడు ఎక్కువ. ఆస్ట్రేలియాపై సిరీస్ విజయం సాధిస్తేనే భారత్ రాబోయే ఐసీసీ ప్రపంచకప్‌లో ఫార్మాట్లలో నంబర్ వన్ జట్టుగా నిలుస్తుంది.
రెండో జట్టుగా భారత్
అన్ని ఫార్మాట్లలో ఏకకాలంలో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్న రెండో జట్టుగా భారత్ రికార్డులకెక్కింది. 2012లో దక్షిణాఫ్రికా ఘనత సాధించింది. ఇక భారత్ టాప్ ర్యాంక్‌లో ఉండగా.. పాకిస్తాన్(115), ఆస్ట్రేలియా(111) రేటింగ్‌తో వరుసగా రెండు, మూడు స్ధానాల్లో ఉన్నాయి. ఆస్ట్రేలియాపై ఐదు వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 276 రన్స్ చేసి ఆలౌటైంది. టీమిండియా బౌలర్లలో మహ్మద్ షమీ 5 వికెట్లతో అద్భుతంగా రాణించాడు.
ఆసీస్ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్(53 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52) హాఫ్ సెంచరీ చేశాడు. జోష్ ఇంగ్లీస్(45), స్టీవ్ స్మిత్(41), మార్నస్ లబుషేన్(39) పర్వాలేదనిపించారు. 277 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 48.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. భారత బ్యాటర్లలో ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (77 బంతుల్లో 10 ఫోర్లతో 71), శుభ్‌మన్ గిల్(63 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 74) అద్బుత ప్రదర్శన చూపారు. వీరిద్దరితో పాటు కేఎల్ రాహుల్(63 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 58 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్ (49 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 50) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఆసీస్ బౌలర్లలో జంపా రెండు వికెట్లు.. కమ్మిన్స్, అబాట్ తలా ఒక వికెట్ తీశారు.