Telangana Assembly తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యేలు, మంత్రులు అసెంబ్లీకి చేరుకున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇదే ఈ ప్రభుత్వానికి చివరి సమావేశం కానుంది. దీంతో ఈ సమావేశంలో కీలక బిల్లులను నెగ్గించుకోవాలని భావిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. ఆర్టీసీ విలీనంపై కూడా సమగ్రంగా చర్చ ఉంటుందని తెలుస్తోంది. ఇటీవల జరిగిన కేబినెట్ బేటీలో సీఎం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రకటించారు. ఇక దీనిపై అసెంబ్లీలో ఏం చర్చిస్తారనేది వేచి చూడాలి.
ఇదంతా ఒక ఎత్తయితే సమావేశాలకు వెళ్లిన నాయకులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ప్రజా సమస్యలపై ఎవరి వైఖరి వారిదే అయినప్పటికీ ఒకరికొకరు మాత్రం మాట్లాడుకున్నారు. పార్టీలతో సంబంధం లేకుండా సాగిన పలకరింపులను మీడియా విశేషంగా పబ్లిష్ చేసింది. అందులో ముఖ్యంగా మంత్రి కేటీఆర్ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సీటు వద్దకు వెళ్లి పలకరించారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకున్నారు. తర్వాత 10 నిమిషాల పాటు మట్లాడుకున్నారు.
ఇక అసెంబ్లీ కారిడార్ లో జగ్గారెడ్డితో మంత్రి కేటీఆర్ ముచ్చటిస్తూ కనిపించారు. నడుచుకుంటూ వెళ్తు జగ్గన్నా అంటూ కాంగ్రెస్ లీడర్ జగ్గారెడ్డిని మంత్రి పలకరించారు. నడుస్తూనే సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్లారు. జగ్గారెడ్డి టీషర్ట్ వేసుకొని అసెంబ్లీకి వచ్చాడు. కేటీఆర్ నవ్వుకుంటూ ‘పిల్లలతో కలిసి తిరిగితే ఎట్లన్నా? అనగా టీ షర్ట్ వేసుకుంటే పిల్లలు అవుతారా? అంటూ జగ్గారెడ్డి ఎదురు ప్రశ్నించారు. జగ్గారెడ్డితో ఉన్న టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిల్ల రాజేందర్ తో మాట్లాడుతూ మీ ఇద్దరికి సోపతి ఎక్కడ కలసిందని అన్నారు. ‘ఒకే కంచం.. ఒకే మంచమని’ మామిల్ల కేటీఆర్ కు చెప్పాడు. సంగారెడ్డిలో జగ్గారెడ్డిని గెలిపిస్తా.. మన దాంట్లోకి పట్టుకస్తా అని మామిల్ల సరదాగా చెప్పాడు.