T BJP Team :
ఢిల్లీ వేదికగా తెలంగాణ బీజేపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏ క్షణంలో ఎలాంటి ప్రటకన వస్తుందోనని అంతా ఎదురు చూస్తున్నారు. ప్రధాని మోదీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం నిర్వహిస్తున్న సమయంలో తెలంగాణ బీజేపీ నేతలు హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. దీంతో ఈ ఉత్కంఠ మరింత పెరిగింది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఇఫ్పటికే ఢిల్లీకి చేరుకోగా, ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా అక్కడే ఉన్నారు.
ఢిల్లీలో ఇటీవల బీజేపీ అంతర్గత సమావేశం జరిగింది. పార్టీ అధ్యక్షుడు నడ్డా నిర్వహించిన ఈ సమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, అన్ని రాష్ట్రాల ఇన్చార్జిలు, మోర్చాల అధ్యక్షులు, మోర్చాల ఇన్చార్జిలతో పాల్గొన్నారు. అయితే ఈ సమావేశం ఎందుకు అనేది ఇప్పటివరకు బయటకు రాలేదు. ఇదిలావుంటే, టీ బీజేపీలో నేతల మధ్య విభేదాలు ప్రస్తుతం తారాస్థాయికి చేరుకున్నాయి. కొంతకాలంగా దీనిపై మీడియాలో విపరీతమైన కథనాలు వచ్చాయి. దీంతో అధిష్ఠానం రంగంలోకి దిగి సమస్యకు ముగింపు పలకాలని నిర్ణయించింది.
అయితే తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందర్ రావు ఢిల్లీకి వెళ్లడం చర్చనీయాంశమైంది. ఆయన కొంతకాలంగా సైలెంట్ గా ఉంటున్నారు. తనకు శాసనసభాపక్ష నేత పదవి కావాలంటున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి. అయితే ఆయన కేంద్ర మంత్రులను కలిసి చర్చలు జరుపుతున్నారు. మరోవైపు కేంద్ర కేబినెట్ మార్పులపై తెలంగాణలో ఆ నేతల్లో కొంత ఆశలు రేకెత్తించాయి. అయితే ఇదే సమయంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఢిల్లీ బయలుదేరడం ఉత్కంఠను రేపుతున్నది. తెలంగాణ బీజేపీ బాధ్యతలను ఈటెల కు అప్పగిస్తారని, కేబినేట్ లోకి బండి సంజయ్ ని తీసుకుంటారని చర్చ సాగుతున్నది. ఇక రఘునందన్ రావుకు శాసనసభాపక్ష నేత పదవి ఖాయంగా కనిపిస్తున్నది.