
ఎన్నికలు సమీపిస్తున్న వేల కేసీఆర్ పాలనను పట్టాలెక్కిస్తున్నారు. ఇన్నాళ్లు పాలన విషయాలను అంతలా పట్టించుకోని సీఎం ఇప్పుడు పరుగులు పెట్టిస్తుండడంతో ప్రతిపక్షాల నుంచి పాలక పక్షం వరకూ భిన్నమైన కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ మధ్యనే మంత్రులతో కొత్త సచివాలయంలో మీటింగ్ పెట్టిన మంత్రి పార్టీ పరమైన విషయాలను చర్చించారు. ఇప్పుడు మళ్లీ మీటింగ్ కు ఐఏఎస్, ఐపీఎస్ లతో పెడుతున్నారు. ప్రభుత్వ పథకాలు, చేపట్టే కార్యక్రమాలపై ఇందులో దిశా నిర్ధేశం చేయనున్నారు సీఎం.
ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం (మే 25) రోజున ఉదయం 11 గంటలకు సెక్రటేరియల్ లోని ఆరో అంతస్తులో కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించబోతున్నారు. ఇందులో ప్రధానంగా రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలపై ఆదేశాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గ్రామాలు, పట్టణాల్లో చేపట్టే కార్యక్రమాలు వేడుకల్లో పాల్గొనే వారికి కల్పించే బందోబస్తు లాంటి విషయాలను ఇందులో చర్చించనున్నారు. ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి ఆ బాధ్యతను పోలీస్ శాఖ తీసుకోవాలని సూచిస్తారని తెలుస్తోంది.
దశాబ్ది వేడుకలతో పాటు 9వ విడుత ‘తెలంగాణకు హరితహారం’, పోడు పట్టాల పంపిణీ, ఇండ్ల పట్టాల పంపిణీ తదితరాలపై సీఎం కేసీఆర్ మాట్లాడనున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అన్ని శాఖ మంత్రులు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడికి కూడా సీఎస్ శాంతికుమారి ఆహ్వానాలు పంపారు. సచివాలయం ప్రారంభోత్సవం తర్వాత సీఎం అధికారులతో నిర్వహించే మొదటి సమావేశం ఇదే. మొదట వీడియోకాన్ఫరెన్స్ లో మాట్లాడాలని అనుకున్న సీఎం తర్వాత నేరుగా సమావేశం పెడితే బాగుంటుందని భావించారు.