KCR :
తెలంగాణ ఉద్యమ సమయంలో చేపట్టిన సకల జనుల సమ్మెలో ఆర్టీసీ ది కీలకపాత్రం. దాదాపు 40 రోజులకు పైగా సాగిన సకల జనుల సమ్మె అప్పటి ఉమ్మడి రాష్ర్ట ప్రభుత్వానికి ఊపిరి సలపకుండా చేసింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఆర్టీసీని గాడిన పెట్టేందుకు కొన్ని చర్యలు చేపట్టిన సఫలం కాలేదు. అయితే ఉద్యమంలో ఇచ్చిన హామీకి తగ్గట్లుగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ ఉద్యోగులు డిమాండ్ చేశారు. కానీ కేసీఆర్ ముందు ఇందుకు అంగీకరించలేదు. పైగా ఏ రాష్ర్టంలోనూ ప్రజా రవాణా సంస్థ ప్రభుత్వ పరిధిలో లేదని తేల్చారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు దిగారు. చిర్రెత్తుకొచ్చిన కేసీఆర్ ఉద్యోగులందర్నీ తొలగించినంత పని చేశారు. ఆ సమయంలో ఆర్టీసీ ఉద్యోగులు కొంత మంది తమ ఉద్యోగాలు ఉంటాయో పోతాయోననే ఆందోళనకు గురై చనిపోయారు. కొద్ది రోజులు తాత్కాలికంగా డ్రైవర్లు, కండక్టర్లను తీసుకొని బస్సులను నడిపించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. అయితే సంస్థ మెరుగయ్యేందుకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులిస్తామని, ఉన్న సంస్థను కాపాడుకోవాలని సూచించారు. బెట్టు వీడిన ఆర్టీసీ ఉద్యోగులను సీఎం కేసీఆర్ విందుకు ఆహ్వనించాడు. అప్పుడు వారిని కార్మికుల నుంచి ఉద్యోగులుగా పరిగణించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక అప్పటి నుంచి ఆర్టీసీ ఉద్యోగులు ఇక సమ్మె జోలికే వెళ్లలేదు.
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఒక్కో వర్గానికి సంక్షేమ పథకాలు ప్రకటించుకుంటూ వెళ్తున్నారు.
అయితే ఎవరూ ఊహించని విధంగా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని రాష్ర్ట కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. ఆర్టీసీ మొత్తాన్ని ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్యం కాని పని. ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీని అంతే ఉంచి ఉద్యోగులను మాత్రం ప్రభుత్వంలో భాగం చేయనున్నారు. అయితే ఇందుకు ఏం చేయాలి. ఎలా చేయాలన్నదానిపై ఓ కమిటీని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ కమిటీ సూచనలకు అనుగుణంగా అసెంబ్లీలో బిల్లు పెడతామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఆర్టీసీలో పని చేసే ఉద్యోగులు… ప్రభుత్వ ఉద్యోగులే. అయితే వారు ఆర్టీసీ కార్పొరేషన్ ఉద్యోగులుగా ఉంటారు . కానీ ఇక ముందు ప్రభుత్వ ఉద్యోగులని చెబుతున్నారు. అయితే రాష్ర్ట ఆర్థిక పరిస్థితి అంతా మెరుగ్గా ఏం లేదు. ప్రస్తుతం తెలంగాణ ఉద్యోగులకు హైదరాబాద్‌లో తప్ప ఇతర జిల్లాల్లో సమయానికి జీతాలు పడడం లేదు. ఆర్టీసీ పరిస్థితి అలాగే ఉంది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న సంస్థలోని ఉద్యోగులను ప్రభుత్వంలో చేర్చితే జీతాలు ఎలా ఇస్తారనే ప్రశ్న తలెత్తుతున్నది. ప్రభుత్వంపై ఆర్టీసీ ఉద్యోగుల్లో తీవ్ర వ్యతరేకతను తొలగించుకునేందుకు సీఎం కేసీఆర్ అనూహ్యంగా ఈ నిర్ణయానికి వచ్చారనే వాదన వినిపిస్తున్నది. మరో మూడు, నాలుగు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో తీసుకునే నిర్ణయం అమల్లోకి వస్తుందా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ReplyForward
|