Telangana Vote on Budget 2024 : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. పార్లమెంట్ ఎన్నికలు ఉన్నందున నేడు ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెడుతుంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి తొలి మూడు నెలల కాలానికి సంబంధించి కేటాయింపులే బడ్జెట్లో ఏడాది అంచనాలను ప్రకటించే అవకాశం ఉంది. నేడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే వేళ ప్రతిపక్ష నాయకుడి హోదాలో కేసీఆర్ రానున్నారని తెలుస్తోంది.
గత అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ అనారోగ్య కారణాల వల్ల హాజరు కాలేదు. ఇప్పుడు కోలుకున్నా రెండు రోజులుగా సభకు గైర్హాజరయ్యారు. దీంతో నిన్న సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ సభకు రావాలని ఆహ్వానించారు. దీంతో కేసీఆర్ నేడు సభకు వస్తారని తెలిసింది. ప్రతిపక్ష, అధికార పక్షాల మధ్య మంచి చర్చలు ఉంటే సభ సమయం సద్వినియోగం అవుతుందని భావిస్తున్నారు.
ఎన్నికల తరువాత కాలు జారి పడటంతో కేసీఆర్ విశ్రాంతి తీసుకున్నారు. ఇప్పుడు పూర్తిగా కోలుకోవడంతో సభకు రావాల్సిన పరిస్థితి ఎదురైంది. డిసెంబర్ 8న బాత్ రూంలో జారి పడటంతో ఎముక విరిగి చికిత్స తీసుకుని ఇంటి వద్దే విశ్రాంతి తీసుకున్నారు. ఇప్పుడు సభకు హాజరు కావాల్సిన సమయం వచ్చినందున అసెంబ్లీ సమావేశాలకు వస్తున్నారని చెబుతున్నారు.
ఈనెల 1న అసెంబ్లీకి వచ్చి గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అధికార పార్టీపై దూకుడు కొనసాగించడానికి అసెంబ్లీకి రావాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ప్రతిపక్ష నేతగా ఏం మాట్లాడతారు? ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేస్తారు? అనే విషయాలపై సందిగ్గత నెలకొంది. ఇంతవరకు అధికారంలో ఉన్న కేసీఆర్ ఇప్పుడు ప్రతిపక్ష నేతగా కొత్త అవతారం ఎత్తనున్నారు.