
The World Cup 2023 : క్రికెట్ వరల్డ్ కప్ సమరం వచ్చేస్తున్నది. ఈ భారీ సమరానికి అన్ని దేశాల జట్లు సిద్ధమవుతున్నాయి. భారీ అంచనాలతో బరిలోకి భారత జట్టు దిగబోతున్నది. ఈసారి వరల్డ్ కప్ లో ఫేవరేట్ జట్టుగా భారత్ నిలవబోతున్నది. ఎంతో పటిష్టంగా, యువకులతో కూడిన జట్టు సిద్ధమవుతుండగా, ప్రస్తుత వెస్టిండీస్ టూర్లో జట్టు వైఫల్యం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. యువకులతో సత్తా చాటుతుందనుకుంటే రెండు వరుస ఓటములతో మరింత నిరాశను మిగులుస్తున్నది.
వెస్టిండీస్ తో ఐదు టీ20ల సిరీస్ లో ఇప్పటికే టీమిండియా రెండింట్లో ఓడిపోయింది. ఇక సిరీస్ ను సొంతం చేసుకోవాలంటే చివరి మూడు మ్యాచ్ ల్లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఉంది. అయితే జట్టు సమష్టి వైఫల్యమే ఈ ఓటమికి కారణంగా కనబడుతున్నది. ఇందులో ఒక్క యువ కుర్రాడు మినహా అందరూ విఫలమయ్యారు. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ మాత్రమే రెండు మ్యాచుల్లో టాప్ స్కోురర్ గా నిలిచాడు. అయితే ఈ రెండు టీ20 మ్యాచుల్లో నాలుగో స్థానంలో బరిలోకి దిగిన ఈ కుర్రాడు తనదైన శైలిలో రాణించాడు. సీనియర్ లా ఆటతీరును కనబర్చాడు.
రెండో టీ 20లో 41బంతుల్లో 51 పరుగులు చేశారు. మొదటి ట్వీ20లో కూడా రెచ్చిపోయి ఆడాడు. అయితే ఇప్పుడు తిలక్ వర్మను ఆటను చూసిన వారంతా నాలుగో స్థానానికి తిలక్ వర్మ సరిగ్గా సరిపోతడాని అభిప్రాయపడుతున్నారు. సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ లాంటి ఆటగాళ్లు ఉన్నా తిలక్ వర్మ మాత్రమే రాణించగలడనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. యువరాజ్ సింగ్ తర్వాత టీమిండియా కు నాలుగో స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు లభించడం లేదు. ఇప్పుడు తిలక్ వర్మ రూపంలో ఆ అవకాశం వచ్చింది. ఆసియాకప్ తో పాటు ప్రపంచకప్ కు కూడా తిలక్ వర్మను ఎంపిక చేయాలని పలువురు కోరుతున్నారు.
ప్రస్తుతం ఉన్న ఆటగాళ్లలో తిలక్ వర్మ కీలకంగా కనిపిస్తున్నాడు. అయితే ఇదే సమయంలో ఆసియా గేమ్స్ 2023 కు ఇప్పటికే తిలక్ వర్మ ఎంపికయ్యాడు. దాని నుంచి తిలక్ వర్మ ను తప్పించి , అదే సమయంలో జరిగే ప్రపంచ కప్ కు ఈ ఆటగాడిని ఎంపిక చేయాలని కోరుతున్నారు. అయితే తెలుగు కుర్రాడి ఎంపిక పై ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతున్నది. టీమిండియాలో తెలుగు కుర్రాళ్లకు కీలక అవకాశాలు దక్కడం లేదని, తిలక్ వర్మ ప్రతిభను కనబరుస్తున్నాడని ఆయనకు జట్టులో స్థానం కల్పించాలని తెలుగు అభిమానులు కోరుతున్నారు.