- యూఎస్ లో మిన్నంటిన జై కాంగ్రెస్ నినాదాలు..
Telangana Congress Grand Victory Celebrations in USA : తెలంగాణలో బీఆర్ఎస్ ను గద్దె దించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆరు గ్యారెంటీల హామీలతో ప్రజల ముందుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రెండు గ్యారెంటీలను విజయవంతంగా అమలుచేస్తోంది. మరో రెండు గ్యారెంటీలను త్వరలోనే అమలు చేయడానికి రంగం సిద్ధం చేస్తోంది. రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ అందించడానికి ఆదివారం కేబినెట్ తీర్మానం చేసింది.
అధికారంలోకి వచ్చిన రెండు నెలల కాలంలోనే తెలంగాణ ప్రజల మనస్సులను కాంగ్రెస్ గెలుచుకుంటోంది. గత ప్రభుత్వ రాచరిక పోకడలకు విరుద్ధంగా ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా చేయడంతో పాటు తెలంగాణ అస్థిత్వానికి పెద్దపీట వేస్తోంది. బీఆర్ఎస్ దూరం కొట్టిన ఉద్యమకారులను అక్కున చేర్చుకుంటోంది. కోదండరామ్ లాంటి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడమే కాదు..ఆయనకు ప్రభుత్వంలో కీలక పదవి ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే ‘‘జయ జయయే తెలంగాణ’’ రాష్ట్ర అధికార గీతంగా ప్రకటించింది. అలాగే టీఎస్ ను టీజీగా, అధికారిక చిహ్నంలోనూ తెలంగాణ ఉద్యమ పోరాట స్ఫూర్తిని ప్రతిబింబించేలా మార్పులను తేబోతోంది.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో నిరుద్యోగులు, ఉద్యోగులు, కాంగ్రెస్ అభిమానులే కాక యావత్ తెలంగాణ ప్రజలు హర్షిస్తున్నారు. రాష్ట్రంలోనే కాదు దేశంలోనూ, ప్రపంచంలోని వివిధ దేశాల్లోనూ కాంగ్రెస్ అభిమానులు, ఎన్ఆర్ఐలు సంబరాలకు హద్దు లేకుండా పోయింది. ఇప్పటికీ సంబరాలు జరుపుతున్నారు.
తాజాగా ఈనెల 3న శనివారం సాయంత్రం యూఎస్ న్యూజెర్సీ లోని ఎడిసన్ లోని రాయల్ అల్బర్ట్ ప్యాలెస్ లో తెలుగు ఎన్ఆర్ఐ కమ్యూనిటీ, తెలంగాణ చాప్టర్ ఆఫ్ ఇండియన్ ఓవర్సిస్ కాంగ్రెస్(IOCA) ఆధ్వర్యంలో ‘‘గ్రాండ్ విక్టరీ సెలబ్రేషన్స్’’ ఘనంగా నిర్వహించారు. ఆన్ లైన్ లో తెలంగాణ ప్రభుత్వంతో ఇంటరాక్ట్ అయ్యారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, ధనసరి సీతక్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈసందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం శుభసూచకమన్నారు. సీఎం, మంత్రులు అధికార దర్పంతో కాకుండా ప్రజాసేవకులుగా పనిచేస్తున్నారని కొనియాడారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుతూ తెలంగాణ పునర్నిర్మాణానికి పాటుపడుతున్నారన్నారు. ఎన్ఆర్ఐలుగా రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము ప్రభుత్వానికి అండగా ఉంటామన్నారు. తెలంగాణ అభివృద్ధికి తమ వంతు ప్రయత్నం చేస్తామని వివరించారు.
All Images Courtesy by Dr. Shiva Kumar Anand
More Images : Indian Overseas Congress (IOCA) USA Celebrated Telangana Grand Victory in USA