Vizag Steel Plant : వైజాగ్ స్టీల్ ప్లాంట్ దగ్గర ఉద్రక్త వాతావరణం నెలకొంది. కాంట్రాక్టు ఉద్యోగులు ఈడీ ఆఫీసు ముట్టడించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొనడంతో భారీగా పోలీసు బలగాలు అక్కడికి చేరుకున్నాయి. మంగళవారం (అక్టోబరు 1) పోలీసు ఉన్నతాధికారులు సైతం స్టీల్ ప్లాంట్ వద్దకు చేరుకున్నారు. ఈడీ కార్యాలయ అద్దాలను కార్మికులు ధ్వంసం చేశారు. అధికారులను బయటకు రాకుండా అడ్డుకొని.. కాంట్రాక్టు ఉన్నంత వరకు తమను కొనసాగించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు.
4,200 మంది కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించడంతో ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా నిరసన చేపడితే.. ఎందుకు అడ్డుకుంటున్నారంటూ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం తమ ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్ట్రాటజిక్ సేల్ పేరిట స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తోందని ఉద్యోగులు మండిపడుతున్నారు.