
KCR Sentiment : ప్రతీ ఒక్కరికీ ఒక సెంటిమెంట్ ఉంటుంది. ఒకరికి నెంబర్, మరొకరికి పర్సన్, ఇంకొకరికి స్థలం ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరి సెంటిమెంట్ వారిది. అలాగే పొలిటీషియన్లకు కూడా సెంటిమెంట్ ఉంటుంది. ఒక నాయకుడు గెలిస్తే ఫలానా ప్రదేశానికి మొదటి సారి వెళ్తా అనుకుంటారు. నామినేషన్ వేసే ముందు నామినేషన్ పత్రాలను కొందరితో దాఖలు చేయిస్తారు. ఫలానా రోజే నామినేషన్ వేయాలని కొందరు అనుకుంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే సెంటిమెంట్లు అనేకం ఉంటాయి.
అందరిలాగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కూడా ఒక సెంటిమెంట్ ఉంది. అదేంటంటే ‘ఆరు (6)’. కానీ పాపం ఇప్పుడు అదే ఆయనను వెక్కిరస్తోంది. యాదృశ్చికమా? లేక ప్రత్యర్థి వ్యూహమో ఏదో తెలియదు కానీ అదే ప్రస్తుతం ఆయనను వెక్కిరిస్తోంది. అధికారంలో ఉన్నన్నాళ్ళు కేసీఆర్ ‘ఆరు.. ఆరు..’ అని కలవరించారు. ఇప్పుడు అదే ‘ఆరు’ ఆయనకు శనిలా దాపురించింది.
కేసీఆర్ సెంటిమెంట్ నెం. 6 ఆయన ఏ కార్యక్రమం చేపట్టాలని అనుకున్నా.. ఏది చేయాలనుకున్నా నెం. 6 వచ్చేలా చూసుకునే వారని అందరికీ తెలిసిందే. కానీ, అదే 6 ఇప్పుడు కేసీఆర్, బీఆర్ఎస్ బలహీనపడేందుకు కారణం అవుతోంది. అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ ప్రకటించిన గ్యారంటీలు.. కేసీఆర్ ను అమితంగా విశ్వసించే నెంబర్ ‘ఆరు’ కావడం గమనార్హం.
ఈ నెం. 6తోనే కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి ట్రీట్ మెంట్ ఇవ్వాలనుకున్నట్టు ఉన్నారేమో.. ఆ నెంబర్ తోనే కేసీఆర్ ను నైరాశ్యంలోకి నెట్టేస్తున్నట్లు కనిపిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు ఆరు గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరితే, తాజాగా ఆరుగురు ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ ను వీడారు. ఇదంతా నెం. 6 దగ్గరే ఆగిపోవడం విశేషం. దీంతో కేసీఆర్ అదృష్టంగా భావించిన నెం. 6 ఆయనను ప్రస్తుతం వెక్కిరిస్తోందన్న సెటైర్లు పేలుతున్నాయి.