
Death Of The Family :
ఇద్దరు చిన్న పిల్లలు. వారి బుడి బుడి అడుగుల సవ్వడిని చూస్తూ.. ముద్దులొలికే మాటలను వింటూ కుటుంబం మరింత ఆనందంగా ఉంది. ఎక్కడి నుంచి వచ్చిందో షేర్ మార్కెట్ రాకాసి పచ్చని కాపురాన్ని కాటు వేసింది. కాల కూట విషం చిమ్మడంతో కంటి నిండి ధు:ఖంతో చిన్నారులను చంపిన దంపతులు వారు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. సుఖంగా సాఫ్ట్ వేర్ జాబ్ చేసుకోకుండా షేర్ మార్కెట్ ఏంటి? అన్న వారు లేకపోలేదు. అదొక వ్యసనంగా తీసుకున్న కుటుంబ యజమాని చివరికి కుటుంబాన్నే లేకుండా కడతేర్చాడు. వివరాలను పరిశీలిస్తే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, కృష్ణా జిల్లా మచిలీపట్టణానికి చెందిన కుటుంబం బెంగళూరులో వారం కిందట బలవన్మరణం చెందింది. దీని వెనుక అసలు కారణాలను పోలీసులు వెలికితీశారు. కర్ణాటక రాష్ట్రం, కాడుగోడి పోలీస్ స్టేషన్ పరిధి సిగేహళ్లిలోని ఓ అపార్టుమెంట్ లో సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్ వీరాంజనేయ విజయ్ (31), తన భార్య హైమావతి (29), ఇద్దరు చిన్నారులు గత నెల (జులై 31న) విగతజీవులుగా కనిపించారు. ఈ ఘటన అప్పట్లో సంచలనం కలిగించింది.
కేసును నమోదు చేసుకున్న పోలీసులు కుటుంబం మొత్తం ఒకే సారి మరణించడంతో కారణం ఏమై ఉంటుంది? ఎవరైనా హత్యా చేశారా? లేక పిల్లలను చంపి దంపతులు చచ్చారా? అని మరింత లోతుగా దర్యాప్తు చేశారు. అయితే వీరి చావులకు కారణం షేర్ మార్కెట్ అని తేల్చారు పోలీసులు. విజయ్ షేర్ మార్కెట్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయగా మొత్తం పోగొట్టుకన్నాడని, దీనికి తోడు అప్పులు కూడా పెరిగాయని మానసిక వ్యథతో ఆత్మహత్య చేసుకున్నట్లు దర్యాప్తు అధికారి డీసీపీ లక్ష్మణ్ ధ్రువీకరించారు. ఐటీ కంపెనీలో టీమ్ లీడర్ అయిన విజయ్ ల్యాప్ ట్యాప్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు సమాచారాన్ని సేకరించారు. అప్పులు పెరిగిపోవడంతో పాటు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయినట్లు గుర్తించారు. ఇద్దరు చిన్నారులను గొంతునులిమి హత్య చేసిన తర్వాత విజయ్, ఆయన భార్య హైమావతి ఫ్యాన్ కు ఉరేసుకున్నట్లు భావిస్తున్నారు. అయితే, కుటుంబ సభ్యులు గొంతు నులిమి కడతేచ్చినట్లు ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్ భావిస్తుంది. కేసు ఇంకా దర్యాప్తులోనే ఉంది.






