
Bezawada Tunnel : బెజవాడ అనేగానే ముందుగా గుర్తొచ్చేది కనక దుర్గమ్మ .. అయితే ఆ ఒక్కటే కాకుండా విజయవాడలో మరెన్నో ఫేమస్ ప్లేస్‌లు ఉన్నాయి. వాటిలో ఒకటే చిట్టినగర్ సొరంగం. విజయవాడ నగర నడిబొడ్డున.. ఇంద్రకీలాద్రి కొండకు కూతవేటు దూరంలోనే ఈ టన్నెల్ ఉంటుంది. నిత్యం వేలాది మంది ప్రయాణించే ఈ సొరంగ మార్గం విశేషాలు తెలుసుకుందాం. కనకదుర్గమ్మ వారధి కట్టకముందు.. హైదరాబాద్ వెళ్లాలంటే ఈ సొరంగమార్గం ద్వారానే వెళ్తారు. ప్రతి రోజు ఈ సొరంగం నుంచే వెళ్తున్నా.., దీని గురించి పెద్దగా ఎవ్వరికి తెలియదు. అసలు అది ఎప్పుడు ఎందుకు నిర్మించారు.
ఈ సొరంగం మార్గం ఏర్పడకముందు గొల్లపూడి నుంచి గాంధీనగర్ వైపు రావాలంటే భవానిపురం బస్టాండ్ సెంటర్ మీదుగా చూట్టూ తిరిగి రావాల్సి వచ్చేది. అది కూడా బాగా సమయం కేటాయించాల్సి వచ్చేది. ఈ సొరంగం మార్గం ఏర్పడ్డాక ప్రయాణ సమయంతో పాటు డబ్బులు కూడా ఆదాఅవుతున్నాయని స్థానికుల మాట. ఈ సొరంగ మార్గం లేనప్పుడు చాలా మంది ఈ కొండపైకి ఎక్కి అవతల వైపు దిగి నగరంలోకి వెళ్ళే వారట.
స్వాతంత్య్రం వచ్చాక దశాబ్ద కాలంలో ప్రజల పడుతున్న అవస్థలు చూసిన అప్పటి నగర కమిషనర్ అజిత్ సింగ్, డాక్టర్ కేఎల్‌రావు ఈ సొరంగ మార్గం ఏర్పాటు చేయాలని ప్రతపాదించారు. తర్వాత ఈ కొండను తవ్వి సరైన రోడ్డు మార్గం ఏర్పాటు చేసి నగర ప్రజలకు అందించారు. 1965 జనవరి నెల నాలుగో తేదీన ఈ సొరంగ మార్గం ప్రారంభించారు. ఈ సొరంగ మార్గం ఏర్పాటు చేయడానికి వాళ్లు చాలా కృషి చేశారని స్థానికులు తెలిపారు.
విజయవాడ బస్టాండ్ నుంచి 20నిమిషాలు సమయం పడుతుంది. లోకల్ ఆటోలు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. బస్టాండ్ నుంచి గొల్లపూడి వెళ్లాలంటే ఈ సొరంగమార్గం నుంచే వెళ్లాల్సి ఉంటుంది.