Congress Chief : కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే దేశ రాజకీయాల్లో సీనియర్ లీడర్. ఎన్నో ఎత్తుపల్లాలను చూసి ఈ స్థాయికి ఆయన చేరుకున్నారు. కర్ణాటక రాష్ర్టానికి చెందిన ఈ నేత, ఇప్పుడు ఏఐసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. సోనియా, రాహుల్, ప్రియాంకలతో అత్యంత సాన్నిహిత్యం ఉన్న నేతగా ఆయనకు పేరుంది.
అయితే ఇటీవల మల్లికార్జున ఖర్గేకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. దీని సారాంశం ఏంటంటే, హిందూ ప్రాంతాల్లో బొట్టు పెట్టుకొని ప్రచారంలో పాల్గొన్న ఖర్గే, ముస్లిం ప్రాంతంలో సమావేశంలో పాల్గొనేముందు బొట్టు తీసేసారని అందులో ట్యాగ్ చేశారు. దీనిని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఖర్గే, కాంగ్రెస్ తీరుపై బీజేపీ శ్రేణులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
అయితే నిజం ఏంటంటే.. కాంగ్రెస్ అధికార వెబ్ సైట్ నుంచి ఈ వీడియోను తీసుకున్న ఒక నెటిజన్ దీనిని 1 నిమిషానికి కుదించి విడుదల చేశాడు. హుబ్బలి-ధార్వాడ లో జరిగిన విలేకరుల సమావేశానికి సంబంధించినది గుర్తించారు. ఈ విలేకరుల సమావేశంలో నాడు ఖర్గే బీజేపీ నాటి కర్ణాటక ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే ఆ సమయంలో ఖర్గే సెక్యూరిటీ గార్డు ఒకరు అతడి ముఖంపై కారుతున్న బొట్టును తుడిచాడు. దీనిని కావాలనే కొందరు ఉద్దేశపూర్వకంగా ట్రోల్ చేస్తున్నట్లుగా సమాచారం. ఇది కుటిల రాజకీయమని కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నారు. దీని వెనుక బీజేపీ నేతల హస్తం ఉందని అభిప్రాయపడుతున్నారు. దీనిని కూడా మతాల కోణం లో చూపించడం ఆ పార్టీ వారికే దక్కుతుందని మండిపడుతున్నారు.