Best Actress : సీని రంగంలో అవార్డుల విషయంలో అప్పుడప్పుడు కొన్ని వివాదాలు తలెత్తుతుంటాయి. కొన్ని సందర్భాల్లో ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకోవడం వింటూనే ఉంటాం. ఇక వారి మధ్య ఆ వివాదం చాలా సంవత్సరాలు కూడా కొనసాగుతుంది. గతంలో కేంద్రం నేషనల్ అవార్డులను ప్రకటించిన సందర్భంలో హీరోలు, హీరోయిన్లు, వారి అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అవార్డులు రాని కొందరు నటులు టాలీవుడ్ హీరోలను టార్గె్ట్ చేస్తూ కామెంట్లు చేసుకుంటున్నారు. అయితే, నంది అవార్డుల విషయంలో టాలీవుడ్ లో కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి.
1950లో ‘ఫిలిం ఫ్యాన్స్ అసోసియేషన్’ అనే ఓ సంఘం మద్రాస్ లో ఉండేది. ప్రతీ ఏటా ఆ సంఘం ఆధ్వర్యంలో అవార్డులు ప్రకటించేది. ఫస్ట్ ఇయర్ అవార్డులను ప్రకటించిన తర్వాత ఉత్తమ నటి విషయంలో వివాదం రాజుకుంది. 1953లో సెన్సార్ అయిన తెలుగు, తమిళం చిత్రాలను పోటీకి పంపారు. అందులో ‘దేవదాస్’, ‘చండీరాణి’ సినిమాలున్నాయి. ఆ రెండు సినిమాలను చూశారు న్యాయ నిర్ణేతలు. ఉత్తమ నటుడిగా అక్కినేని నాగేశ్వరరావు (దేవదాస్), ఉత్తమ నటిగా భానుమతి (చండీరాణి)కి ప్రకటించారు. తమిళంలో సావిత్రిని (దేవదాస్) ఉత్తమ నటిగా ప్రకటించారు. దీంతో సినీ ఇండస్ట్రీ నుంచి ఫ్యాన్స్ వరకు అందరూ షాక్ కు గురయ్యారు. ఈ రెండు సినిమాలు కూడా తెలుగు, తమిళ భాషల్లో నిర్మాణం చేసుకున్నాయి.
ఒకే సినిమా రెండు భాషల్లో తీయగా ఒక భాషలో ఒక నటికి మరో భాషలో మరో నటికి ఉత్తమ నటి అవార్డు ఇవ్వడం ఏంటి? ఇద్దరికి రెండు భాషల్లో ఇవ్వాలిగా? అన్న సందేహాలు వినిపించాయి. అయితే, ఒకే అవార్డును ఇద్దరికీ ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే అవార్డులను పంచారా? అంటూ వార్తలు వినిపించాయి. ఉత్తమ నటిగా సావిత్రి అవార్డు దక్కించుకుంది. కానీ ‘చండీరాణి’కి ఉత్తమ నటి అవార్డు అందుకునేందుకు భానుమతి హాజరు కాకపోవడం గమనార్హం.