
Final Farewell to Folk Singer Gaddar : గద్దర్ వ్యక్తి కాదు ఉద్యమ స్ఫూర్తి, ఉద్యమ పాట. తన జీవితాన్ని ప్రజా క్షేత్రానికే అంకితం చేసిన మహోన్నతమైన వ్యక్తి. ఆది నుంచి పీడిత ప్రజల కోసమే పరితపించారు ఆయన. 1971 నుంచి ఆయన సినిమాలకు పాటలు రాయడం ప్రారంభించాడు. 1987లో కారంచేడు దళితుల హత్యలపై అవిశ్రాంతంగా పోరాడడు. దీనితో పాటు మావోయిస్ట్ ఉద్యమకారులకు ఆయన మద్దుతుగా నిలుచుండేవారు. భూటకపు ఎన్ కౌంటర్లపై తీవ్రంగా విరుచుకుపడేవారు.
స్వరాష్ట్ర ఉద్యమం సమయంలో గద్దర్ ఎన్నో పాటలు రాసి ఆలపించాడు. అందులో ‘అమ్మా తెలంగాణమా’ అనే పాట ఆదరణ పొందింది. ‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా’ అనే పాట ఆయనే రాసి స్వయంగా పాడారు. ఇక అలనాటి సినిమాలలో ‘భద్రం కొడుకో’, ‘మదనసుందరి’, ‘అడవి తల్లికి వందనం’ లాంటి ఎన్నో పాటలను పాడిన గొంతు ఆయనది. ‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా’ పాటకు నంది అవార్డుకు ఎంపికయ్యారు. కానీ ఆయన దాన్ని తిరస్కరించారు. ‘మా భూమి’ సినిమాలో తొలిసారి కనిపించిన ఆయన ‘జై బోలో తెలంగాణ’లో కూడా నటించారు.
గుండెపోటుతో 3 రోజుల క్రితం చికిత్స పొందిన ఆయన ఆగస్ట్ 6 (ఆదివారం)వ తేదీ తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివ దేహాన్ని ఎల్బీనగర్ స్టేడియంలో ఉంచగా ప్రముఖులు నివాళులర్పించారు. ఎల్బీ నగర్ స్టేడియం నుంచి పార్థివ దేహాన్ని అల్వాల్ లోని గద్దర్ ఇంటికి అంతిమయాత్రగా తీసుకెళ్లారు. అధిక సంఖ్యలో బంధువులు, ఉద్యమకారులు, గాయకులు, నాయకులు, యువత తరలివచ్చారు. కడసారి చూసి లాల్ సలామ్ చెప్పారు.
గద్దర్ అల్వాల్‌లో స్థాపించిన మహా బోధి విద్యాలయంలో ప్రభుత్వ లాంఛనాల మధ్య అంత్యక్రియలు జరగనున్నాయి. అందుకు పూర్తి ఏర్పాట్లను పూర్తి చేశారు. గద్దర్ మృతిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర రాజకీయ నేతలు, ప్రముఖులు, సినీ గేయ రచయితలు, కళాకారులు సంతాపం తెలిపారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.