Chandrababu : ఏపీలో గత నాలుగేళ్లుగా పరిస్థితులు మారిపోయాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక పరిస్థితి మరింత చేతులు దాటిపోయింది. ఇక మళ్లీ రౌడీ రాజ్యం, ఫ్యాక్షనిజం వేళ్లూనుకుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. దీనికి ప్రధాన కారణం ఎవరనేది పక్కన పెడితే, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అందుకు దోహదం చేసేలా కనిపిస్తున్నాయి.
అయితే రాయలసీమలో ఫ్యాక్షనిజం, కోస్తాలో రౌడీయిజం 1995కు ముందు పెద్ద ఎత్తున పెనవేసుకున్నది. ఎప్పుడైతే టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారంలో వచ్చారో ఆ రెండింటిపై ఉక్కుపాదం మోపారనే పేరుంది. ఇందుకోసం పోలీస్ అధికారులకు విస్తృత అధికారాలు ఇచ్చినట్లు చెబుతారు. ఈ క్రమంలో చాలా మంది నేరగాళ్లు రాష్ర్టం దాటి, పారిపోయినట్లు చెబుతుంటారు. ఇక రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని పూర్తి స్థాయిలో కంట్రోల్ చేశారు. 2004 లో రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కూడా ఇదే కంటిన్యూ చేశారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే ఇటు రౌడీలు, ఫ్యాక్షనిస్టులతో పాటు సమాజానికి హాని అనుకున్న చాలా మందికి చుక్కలు చూపించారని, ఆ తర్వాతనే రాష్ర్టంలో చాలా వ్యవస్థలు కంట్రోల్ లోకి వచ్చాయని చెబుతుంటారు.
అయితే ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ వ్యవస్థలు మళ్లీ యాక్టివ్ అవుతున్నట్లు ఆరోపణలు వినిపస్తు్న్నాయి. వీటిపై పోరాడడంలో భాగంగా చంద్రబాబు కూడా నేతలకు కూడా తగ్గేది లేదని, అండగా ఉంటానని చెబుతున్నట్లు కనిపిస్తున్నది. అయితే ఏపీ భవిష్యత్ కు ఇది మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఎదుటివారు చేస్తున్నారని, అంత సీనియర్ నేత కూడా ఇలాగే వ్యవహరిస్తే సరికాదనే అభిప్రాయం వినిపిస్తున్నది. టీడీపీ అధినేత చంద్రబాబు ద్వారా గతంలో ఎన్నో గ్రామాలు ఫ్యాక్షన్, రౌడీయిజం కోరల నుంచి బయటపడ్డాయి.
ఎందరో పోలీస్ ఆఫీసర్లు కీలకంగా మారారు. సురేంద్రబాబు, ఏబీ వెంకటేశ్వర్ రావు, స్టీఫెన్ రవీంద్ర, ఉమేశ్ చంద్ర లాంటి ఎందరో కీలక ఆఫీసర్లు నాడు ఏ ఒక్కరినీ వదిలిపెట్టకుండా పల్లెల్లో శాంతి నెలకొనేలా పనిచేశారు. ఇలాంటి ఆఫీసర్లకు నాటి ముఖ్యమంత్రి ఇచ్చిన విస్తృత అధికారాలే కారణం. ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా మళ్లీ పాత రోజుల వైపు అడుగులు వేయడం సరికాదని అంతా భావిస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో రెండు పార్టీ మధ్య పోరు, మళ్లీ గత రోజులను తలపిస్తున్నది. దీనికి ఊతమిచ్చేలా అధినేతలు ప్రవర్తించడం సరికాదనే అభిప్రాయం వినిపిస్తున్నది.