
భారతదేశ కీర్తి ప్రతిష్టలు దశ దిశలా చాటే కార్యక్రమానికి ఢిల్లీ ఆదివారం వేడుకైంది. ప్రధాని ఏ కార్యక్రమం చేపట్టినా హిందూ ధర్మం, వైదికంగా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. గతంలో రామమందిరం నిర్మాణానికి శంకుస్థాపన వేసిన సమయంలో కూడా వేద మంత్రోశ్చరణాల మధ్య గొప్పగా నిర్వహించారు. ఆ సమయంలో ఆ కార్యక్రమాన్ని ప్రపంచం యావత్తు చూసింది. ఇక ఇప్పుడు భారతదేశానికే హృదయభాగంగా ఉండే పార్లమెంట్ భవనాన్ని కూడా అంతే వైభవంగా నిర్వహించారు.

నూతనంగా నిర్మించిన దేశ అత్యున్నత పార్లమెంట్ భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం (మే 28) వైభవంగా ప్రారంభించారు. మొదట ఆయన వేద పండితుల వేద మంత్రోశ్చరణాల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అగ్ని కార్యం నిర్వహించారు. అగ్నికి వస్త్రం, ఫలాలు అర్పించారు. అనంతరం రాజ దండం (చెంగోల్) నికి సాష్టాంక నమస్కారం చేశారు. వేద పండితులు ఆయనను ఆశీర్వదించారు. ఆ తర్వాత ఆ రాజ దండాన్ని వివిధ పీఠాల అధిపతులు ప్రధానమంత్రికి అందజేశారు. వారి ఆశీస్సులతో పాటు దండాన్ని ఆయన అందుకున్నారు. దండంతో పాటు ప్రదిక్షిణలు చేశారు.
మేళతాళాలు బాజా భజంత్రీల మధ్య రాజ దండంతో కొత్త పార్లమెంట్ భవనంలోకి అడుగుపెట్టారు ప్రధాన మంత్రి. ఆయన ముందు వివిధ పీఠాల అధిపతులు ఉన్నారు. వారితో పాటు వివిధ శాఖల మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు. వారందరి సమక్షంలో ఆయన రాజ దండం (చెంగోల్)ను పార్లమెంట్ లోని స్పీకర్ వెనుక ఏర్పాటు చేసిన ప్రత్యేక నిర్మాణంలో పొందు పరిచారు.

ఆ తర్వాత జ్యోతి ప్రజ్వలన చేశారు. వందే మాతరం గీతం మేళతాళా మధ్య ఆయన పార్లమెంట్ భవనాన్ని అంగరంగ వైభవంగా ప్రారంభించారు. దాదాపు 20 ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాయి. పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేశారు.






