Baby Rajaram Bokale : సంక్షోభంలో అవకాశాలను వెతుక్కోవాలి.. అనేమాట వింటూనే ఉంటాం. అలా అవకాశాలు వెతుక్కున్న వారిలో ‘బేబీ రాజారాం బోకాలే’ ఒకరు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వచ్చేసింది. దీంతో చాలా మంది ఉపాధి కోల్పోతున్నారు. దీంతో కార్మిక రంగంలో తీవ్ర అనిశ్చితి నెలకొంది. టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగించడంతో ఉద్యోగులు మరింత ఆందోళన చెందుతున్నారు.
మహారాష్ట్ర, ఖరాడి సబర్బ్‌కు చెందిన బేబీ రాజారాం బోకాలే కొత్త అవకాశాలను సృష్టించుకుంటోంది. నిన్న, మొన్నటి వరకు చిరు మసాలా దినుసుల వ్యాపారిగా ఉన్న ఆమె మైక్రోసాఫ్ట్ డెవలప్ చేసిన ఏఐ టూల్ తో మరాఠీ నేర్పిస్తోంది. ఇందుకు ఆమె గంటకు సుమారు రూ. 400 వరకు సంపాదిస్తుంది. ఇలా ఎన్ని గంటలు పని చేస్తే అన్ని 400 అన్నమాట. ఇందంతా కూడా ఆమె ఇంట్లో ఉండే ఆర్జిస్తున్నట్లు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తెలిపింది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కూడా తమ ఏఐ టూల్స్ కోసం ఆమె చేస్తున్న కృషిని గుర్తించి.. ప్రశంసల వర్షం కురిపించారు.
ఇంతకీ ఆమె ఈ పని ఎలా చేస్తుందంటే?
ఇంట్లో కూర్చొని తన స్మార్ట్ ఫోన్ లో మైక్రోసాఫ్ట్ యాప్ ను ఓపెన్ చేసి మరాఠాలో కథలను చదువుతుంది. ఇది ఆమె రోజూ చేసే పని అని మైక్రోసాఫ్ట్ తన బ్లాగులో పేర్కొంది. దీనిపై బోకాలే మాట్లాడుతూ.. ‘మైక్రోసాఫ్ట్ నా వాయిస్ రికార్డ్ చేస్తున్నందుకు గర్వపడుతున్నా. ఇప్పుడు నా వాయిస్‌తో మరాఠీ నేర్చుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ రూపొందించిన ఏఐ టూల్స్‌ను మరాఠాలో తన వాయిస్‌తో అందుబాటులోకి తేవడం సంతోషంగా ఉంది’ అన్నారు.
బ్యాంకులు ఎలా పని చేస్తాయి? పొదుపు ఎలా చేయాలి? మోసాలను ఎలా నిలువరించాలి? ఇలా అనేక అంశాలను చెప్తుంది. ఆమె వాయిస్‌తోనే మైక్రోసాఫ్ట్ సృజనాత్మకత జోడించి అందిస్తుందని మైక్రోసాఫ్ట్ తన బ్లాగ్‌లో పేర్కొంది. బోకాలేను సీఈఓ సత్యనాదెళ్ల ప్రశంసించారు. ‘భారతీయ మహిళలు మైక్రోసాఫ్ట్ అభివృద్ధి చేస్తున్న ఏఐ టూల్స్‌కు సాయం చేస్తున్నారు’ అని ట్వీట్ చేశారు.