
Rakesh master : ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ ఆదివారం చనిపోయారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు ఆదివారం ఉదయం రక్త విరేచనాలు కావడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్ కు తరలించారు. చివరి వరకూ పోరాడిన వైద్యులు ఆయనను కాపాడలేక పోయారు. ఆయన మరణం తెలుగు రాష్ట్రాలతో పాటు బాలీవుడ్, కోలీవుడ్ లాంటి చిత్ర పరిశ్రమలను కూడా షాక్ కు గురి చేసింది. అయితే ఆయన మరణించి గంటలు గడుస్తున్నా ఏ సినీ ఇండస్ట్రీ నుంచి ప్రముఖులు కనిపించలేదు. ఎవరూ ఆయన పార్థివ మృతదేహానికి నివాళులు అర్పించలేదు. వచ్చి చూడకపోగా ఇప్పటి వరకు తాము సంతాపం తెలుపుతున్నట్లు ప్రముఖులు ఎవరూ సోషల్ మీడియా వేదికగానైనా ప్రకటించలేదు.
అయితే రాకేశ్ మాస్టర్ బతికి ఉండగా ఎలాంటి అవకాశాలు ఇవ్వలేదన్న ఆయన శిష్యులు, అభిమానులు చనిపోయిన తర్వాత కూడా పట్టించుకోకుండా ఇండస్ట్రీలు పగ సాధిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీల నుంచి ఎవరూ పలకరించకుండా అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బతికినంత కాలం రాకేశ్ మాస్టర్ ముక్కుసూటిగా వ్యవహరించే వారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో పాటు మెగాస్టార్ చిరంజీవిని కూడా ఆయన చాలా ఇంటర్వ్యూలలో అవమానించారు. వీటన్నింటి కారణంగా ఆయనకు అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఆ తర్వాత పొట్టకూటి కోసం డాన్స్ స్కూల్ పెట్టుకున్నారు. దీంతో పాటు యూట్యూబర్ గా కూడా ఎంతో కొంత సంపాదించే వారు. ఒకానొక సమయంలో కాస్ట్ లీ కార్లలో తప్పితే కనిపించని రాకేశ్ మాస్టర్ చనిపోయే రోజు వరకు అద్దెంట్లో జీవించే పరిస్థితికి దిగజారారు.
ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గుతుండడంతో సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను పెంచుకుంటూ పోయారు రాకేశ్ మాస్టర్. ఇక డాన్స్ షోలతో పాటు జబర్దస్త్ లాంటి వాటిలో ఆయన అప్పుడప్పుడూ కనిపించుకుంటూ వచ్చారు. ‘హను-మ్యాన్’ సినిమాలో నటించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ లో పాల్గొన్న సమయంలోనే ఆయనకు రక్త విరేచనాలు, వాంతులు అయ్యాయి. ఆ సమయంలోనే తన ఆరోగ్యం మరింత దిగజారిందని వైద్యులు కూడా చూసించారట.






