Women bill : కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో కీలక బిల్లులకు మోక్షం లభించిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. తాజాగా మహిళా బిల్లు కూడా లోక్ సభ ముందుకు రావడం పాలకుడి చిత్తశుద్ధిని తెలుపుతున్నదని బీజేపీ శ్రేణులు కొనియాడుతున్నాయి. అయితే గతంలో ట్రిపుల్ తలాక్ రద్దు, ఆర్టికల్ 370 రద్దులాంటి కీలక నిర్ణయాలను మోదీ ప్రభుత్వం తీసుకున్నది. జీఎస్టీ బిల్లు కూడా ఆయన హయాంలోనే వచ్చింది.
2014, 2019 ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలవడం నరేంద్రమోదీకి కలిసివచ్చింది. దేశంలో ఎన్నో మార్పులకు ఆయన సారథ్యంలోని సర్కారు శ్రీకారం చుట్టింది. ఒక్క నోట్ల రద్దు అంశంలో కొంత ఇబ్బందులు ఎదురైనా వాటన్నింటినీ దాటుకొని నరేంద్రమోదీ సర్కారు ముందుకెళ్తున్నది. తాజాగా మహిళాబిల్లును కూడా ఆయన పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చారు. ఇప్పటికే ఈ బిల్లుకు కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. తమ ప్రభుత్వం ఈ బిల్లును తప్పక నెరవేరుస్తుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ ఇప్పటికే ట్వీట్ చేశారు. అయితే ఈ బిల్లు అమల్లోకి వస్తే లోక్ సభ, అసెంబ్లీలో 33 శాతం రిజర్వేషన్ మహిళలకు వర్తించనుంది.
ఇక 1996లో హెచ్ డీ దేవెగౌడ సారథ్యంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం తొలుత లోక్ సభలో ప్రవేశ పెట్టింది. ఆ తర్వాత వాజ్ పేయి, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాలు ఈ బిల్లును ప్రవేశ పెట్టినా ఆమోదానికి నోచుకోలేదు. 201లో రాజ్య సభలో ఆమోదం పొందినప్పటికీ, లోక్ సభలో మాత్రం పెండింగ్ లో ఉండిపోయింది. 2014 లో నాటి లోక్ సభ రద్దు కావడంతో ఇక ఆగిపోయింది. తాజాగా నరేంద్ర మోదీ సర్కారు మరోసారి మహిళా బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టింది.
అయితే 1998 జూలై 13న ఎన్డీయే ప్రభుత్వ హయాంలోనే న్యాయశాఖ మంత్రి ఎం తంబిదురై లోక్ సభలో ప్రవేశపెట్టారు. అప్పుడు స్పీకర్ గా తెలుగు వ్యక్తి, ఏపీకి చెందిన బాలయోగి ఉన్నారు. నాడు ఆర్జేడీ ఎంపీ సురేంద్ర యాదవ్ వెల్ లోకి వెళ్లి ఈ ప్రతులను చింపివేశారు. 1999లో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టటింది. కానీ ఆమోదం పొందలేదు. 2002లో మరోసారి తీసుకొచ్చినా సాధ్యం కాలేదు. ఇక 2003లో వాజ్ పేయ్ ప్రభుత్వం రెండుసార్లు ప్రయత్నించింది.
ఈ బిల్లులో మార్పుల చేయాలని నాటి ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. 2008లో రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశ పెట్టారు. 2010 మార్చి 9న ఈ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందింది. కానీ సమాజ్ వాదీ పార్టీ, ఆర్జేడీ ఈ బిల్లును వ్యతిరేకించాయి. అయితే ఇప్పుడు కూడా కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిపినా, బిల్లు ఆమోదం పొందుతుందా లేదా అనే అనుమానం అందరిలో ఉంది. ఇక ఈ బిల్లును కేంద్రం పెట్టడం వెనుక తమ పోరాటమే కీలకంగా ఉందని బీఆర్ఎస్ నాయకురాలు, తెలంగాణ ఎమ్మెల్సీ కవిత ప్రధానంగా చెప్పుకుంటున్నారు.