Khalistani in Canada : ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య భారత్, కెనడా దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందంటూ ఏకంగా ఆ దేశ ప్రధాని ప్రకటించడం వివాదానికి కారణమైంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఇరు దేశాలు దౌత్యదాడికి దిగాయి. ఇరు దేశాల దౌత్య వేత్తలను దేశం విడిచి వెళ్లాలని కోరుకునే వరకు పరిస్థితి వచ్చింది. ఈ సమయంలో కెనడాలో మరో ఖలిస్థాని సభ్యుడి హత్య జరిగింది. అయితే ప్రత్యర్థుల కాల్పుల్లోనే అతడు మృతి చెందినట్లు ధ్రువీకరించారు.
కెనడాలోని విన్నిపెగ్ లో బుధవారం రాత్రి తొమ్మిది గంటలకు గ్యాంగ్ స్టర్ సుఖ్దుల్ సింగ్ అలియాస్ సుఖా దునెకేగా ను ప్రత్యర్థులు కాల్చి చంపారు. ఈయన పంజాబ్ లో పుట్టి కెనడాకు వెళ్లాడు. భారత్ లో ఆయనపై తీవ్ర నేరారోపణలు ఉన్నాయి. హత్య, దోపిడీ, కిడ్నాప్ వంటి హింసా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నాడు. 2017 డిసెంబర్ లో నకిలీ పత్రాలతో కెనడా పారిపోయాడు. ఆ తర్వాత ఖలిస్థానీ ఉగ్రవాది అర్షదుల్లా, గ్యాంగ్ స్టర్ లక్కీ పాటియల్ ముఠాలో పని చేయడం ప్రారంభించాడు. ఖలిస్థానీ మద్దతుదారులతో కలిసి కీలకంగా పనిచేస్తున్నాడు. అయితే సుఖ్దుల్ సింగ్ ను తామే చంపామంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. ఇక ఈ లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం భారత జైల్లో పని చేస్తున్నాడు. ఆయన ముఠా కెనడాలో తన కార్యకలాపాలను నిర్వహిస్తున్నది.
అయితే కెనడా తీరుపై కొంతకాలంగా భారత్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నది. ఖలిస్థానీ ఉగ్రవాదులకు స్థావరంగా కెనడా మారింది. తన పదవి కోసం ట్రూడో వారికి సహకారం అందిస్తున్నాడనే ప్రచారం జరుగుతున్నది. కేవలం రాజకీయాల్లో మద్దతు కోసం ఇలా ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే కెనడా తీరును భారత్ ఎప్పటికప్పుడూ తిప్పికొడుతున్నది. మరి రానున్న రోజుల్లో ఈ వివాదం ఎటు దారితీస్తుందో తెలియక కెనడాలోని భారతీయులు భయాందోళనలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే భారతీయులు దేశం విడిచి వెళ్లాలని ఖలిస్థానీ ఉగ్రవాదులు హెచ్చరికలు జారీ చేశారు.