Ayodhya Ram Temple : మన దేశ ప్రజా విజయంగా, హిందూ ప్రజాభీష్టంగా ఇవాళ అయోధ్య రామాలయం నిర్మితమైంది. మన జాతీయతా భావం వైభవంగా పున్నర్మితమైంది. మన జాతి జనుల ఆకాంక్షకు సాకారంగా ఇవాళ అయోధ్య రామాలయం పొలుపుగా పొటమరించింది.
ఐదు శతాబ్ధాల క్రితం హిందూ ప్రార్థనా స్థలంగా విలసిల్లి, దురాక్రమణకు గురై, బలై ఐదు శతాబ్దాల తరువాత మళ్లీ హిందూ ప్రార్థనా స్థలంగా రూపొందింది అయోధ్య రామాలయం. ప్రపంచ సాంస్కృతిక, మతపరమైన సంఘటనల్లో ఇది ఒక అరుదైన అద్భుతం. ఒక సాంస్కృతిక విప్లవం వల్ల వచ్చిన సత్ఫలితానికి ఆకృతి ఈ అయోధ్య రామాలయం. ఈ ఆయోధ్య రామాలయం ఒక చారిత్రిక సంఘటనగా ప్రపంచ దేశాల్లో విశేషమైంది.
ఈ దేశ ప్రజలు కలిసికట్టుగా తమ ధార్మిక చిహ్నాన్ని పునః ప్రతిష్ఠించుకున్నారు.
ప్రజాభీష్టం; ప్రజాస్వామ్యబద్ధంగా ఈ దేశ నిజ పౌరులు తమకు జరిగిన అన్యాయానికి చేసుకున్న పరిష్కారం ఈ అయోధ్య రామాలయ నిర్మాణం. ఇవాళ ఇంత ఉన్నతంగా అయోధ్య రామాలయం కట్టుకుని భారతీయులు గెలిచారు. భారతీయత సాధించిన పెనువిజయం ఇది. ఈ అయోధ్య రామాలయ నిర్మాణం ప్రపంచానికి మన దేశం ఇస్తున్న ఒక విశిష్ట సందేశం.
ఇక్కడ రామాలయమే లేదని కొందరు దేశ, జాతి వ్యతిరేకులు చారిత్రక వక్రీకరణ చేసేందుకు, సత్యాన్ని చంపేందుకు ప్రయత్నించి విఫలం అయ్యారు. కొందరు ఇంకా ఈ విజయానికి వ్యతిరేకంగా మాట్లాడుతుండడం బానిస మనస్తత్వాన్నీ, జాతి, జాతీయతా వ్యతిరేకతనూ తెలియజేస్తోంది. కాలమే వాళ్లకు బుద్ధి చెబుతుంది. వాళ్లను పక్కకు నెట్టేసి దేశ జనం వడివడిగా ముందుకు నడుస్తోంది.
విదేశీ ఆక్రమణదారులు దౌష్ట్యంతో, దౌర్జన్యంతో ఈ దేశంలోని వేలాది ఆలయాల్ని కూల్చేశారు. ఆలయాల్ని కూల్చడం అన్నది రాజ్యకాంక్షో, మరొకటో కాదు, అది మతోన్మాదం. విదేశీ దురాక్రమణదారులు ఆలయాల్ని కూలగొట్టడం మతోన్మాదం కాదు రాజ్య విస్తరణ కాంక్ష అని, మరొకటని కొందరు వాదిస్తున్నారు. మెదళ్లల్లో మకాలి (Macaulay) కూరిన, కూర్చిన బానిసత్వంవల్లా, విదేశీ విపరీత భావజాలంతో మానసికంగా దెబ్బతినడం వల్ల వాళ్లు ఇలా రచ్చ చేస్తూంటారు.
లక్షలాది కాశ్మీరీ హిందువుల్ని మతోన్మాదం ఊచకోత కోస్తే , ఉగ్రవాదం అమానుషంగా
వేలాది హిందూ మహిళల మాన ప్రాణాల్ని తీసేస్తే, ఈ మట్టి బిడ్డలైన హిందూ జన విధ్వంసం జరిగితే ఏ మాత్రమూ బాధపడడం కాదు కదా కనీసం నోరు కూడా విప్పని వాళ్లు ఒక పాత కట్టడం దేశ ప్రజల అభీష్టం మేరకు కూల్చి వేయబడితే దాన్ని తప్పు పట్టడం అవివేకం. ప్రపంచంలో ఎక్కడా లేనన్ని మసీదులు ఈ దేశంలో ఉన్నాయి అన్న క్షేత్ర వాస్తవం సనాతనులు లేదా హిందువులకు మతోన్మాదం లేదు అన్న సత్యాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది.
రాముడు ఉత్తరాది దేవుడని, దక్షిణాది దేవుడు కాదని కొందఱు పేలాపన చేస్తున్నారు… తమిళనాడు కుంబకోణం దగ్గఱున్న కోలవిల్లి రామర్ ఆలయం 9 వ శతాబ్ది లేదా 8వ శతాబ్ది(750)దని పరిశీలనలు తెలియజేస్తున్నాయి. ఈ ఆలయం గురించి 8వ శతాబ్ది తిరుమంగై ఆళ్ష్వార్ పాడారు. ఈ ఆలయం తరువాత 120 ఏళ్లకు మదురాందగంలో ఒక కోదండరామ ఆలయం నిర్మితమైంది. ఈ ఆలయంలోనే రామానుజుల (11వ శతాబ్ది)వారికి వారి గురువు ఆళవందార్ శంకు చక్రాల్ని వేశారు. అంటే రామానుజులు సాంప్రదాయికంగా వైష్ణవుడయింది. ఈ కోదండరామ ఆలయంలోనే. 8, 9,10 శతాబ్ధాలకే దక్షిణాదిలో ప్రముఖమైన రామాలయాలు ఉన్నాయని చారిత్రికంగా తెలియవస్తోంది.
కొంచెం బుద్ధి పెట్టి ఆలోచిస్తే రాముడి ఆరాధన దక్షిణాదిలో ఎంత ఉందో తెలియవస్తుంది. దక్షిణాదిలో అన్ని భాషల్లోని అన్ని కులాల ప్రజల్లో రాముడికి చెందిన పేర్లు అత్యంత ఎక్కువగా ఉంటాయి. అంటే రాముడు దక్షిణాది ప్రజల్లో ఎంతగా నెలకొని ఉన్నాడో తెలుసుకోవచ్చు. త్యాగయ్య రామ కీర్తనలు, స్వాది తిరునాళ్ రామ రచనలు, భద్రాచల రామదాసు రామ రచనలు రాముడు దక్షిణాదిలో ఏ మేఱకు పాతుకుని ఉన్నాడో తెలియజెబుతాయి. 8వ శతాబ్ది కులశేఖర ఆళ్ష్వార్ రాముడి ఆరాధకులు. రామాయణాన్ని ఆలకిస్తూ తనను తాను రాముడుగా భావించుకునేవారు. కులశేఖర ఆళ్ష్వార్ కారణంగా కేరళలో రామ ఆరాధన బాగా చలామణిలోకి వచ్చింది. శ్రీరంగం ఆలయంలో రాముడి సన్నిధి 10వ శతాబ్దికి పూర్వందే.
మనదేశంలో రామాలయాలు ఏ నాలుగు, ఐదువందల ఏళ్ల నాటివో కావు. వెయ్యేళ్లకు పూర్వం నుండే మనకు రామాలయాలు ఉన్నాయి. మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతంలోని పంచవటిలో ఉన్న కాలారామ్ గుడి 7వ శతాబ్దిలోది. అక్కడి రామ విగ్రహం 2000 ఏళ్ల నాటిదిగా పరిగణించబడుతోంది. రామాయణం వ్యావహారిక లేదా సామాన్య శకానికి పూర్వం (B.C.E.) 300 నాటిదని Oxford English Reference Dictionary తెలియజేస్తోంది. అంతర్జాతీయ పరిశోధకుడు Robert Philip Goldman రామాయణ పాఠం (text) వ్యావహారిక లేదా సామాన్య శకానికి పూర్వం (B.C.E.) 7వ శతాబ్ది నుంచి లభ్యమౌతోందని తెలియజెప్పారు. రామాయణంలో ప్రస్తావితమైన ఖగోళ సంఘటనల ఆధారంగా రామాయణ కాలం గురించి సహేతుకంగా చేసిన అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాల ప్రకారం రామాయణం ఇప్పటికి 7000 ఏళ్ల క్రితంది. అంతర్జాలంలో ఈ విషయానికి సంబంధించిన వివరాలు, వివరణలు ఉన్నాయి. రామాయణం, రాముడు కావ్యేతిహాసాలుగా 10వ శతాబ్దిలో పొన్న రాసిన రామకథ ద్వారా కన్నడంలోకి, 12వ శతాబ్దిలో కంబర్ రాసిన కంబ రామాయణం ద్వారా తమిళ్ష్‌లోకి,13వ శతాబ్దిలో గోనబుద్ధా రెడ్డి రాసిన రంగనాథ రామాయణం ద్వారా తెలుగులోకి రావడం జరిగింది.
చరిత్ర తెలియకుండా, సంప్రదాయం తెలియకుండా, జరిగింది తెలియకుండా, ఉన్నది తెలియకుండా, సంస్కారం లేకుండా రాముడు పరంగా వికృత పేలాపన చేస్తున్నవాళ్లను పక్కకు నెట్టేసి మనం రామ స్ఫూర్తితో భవిష్యత్తులోకి వెళ్లాలి.
“జయ జయ రామ సమర విజయ రామ” అంటూ అన్నమయ్య ఒక సంకీర్తన చేశారు. మన దేశం విదేశీ మతోన్మాదంపై సమష్టిగా సాధించిన సమర విజయం ఇవాళ్టి ఈ అయోధ్య రామాలయం. జయ జయ రామ సమర విజయ రామ అని అన్న అన్నమయ్య రాముణ్ణి “భయహర…” అంటూ కొనసాగారు. ఇవాళ్టి మన విజయంగా రూపుదిద్దుకున్న ఈ అయోధ్య రామాలయం ప్రేరణతో మన భయాలు హరమైపోగా మనం తదుపరి విజయాల కోసం కొనసాగాలి, మునుసాగాలి.
రాముడు మన జాతికి ఒక స్ఫూర్తి; రాముడు మనకు సత్‌స్ఫూర్తి. ఇవాళ్టి అయోధ్య రామాలయం ఒక విజయ స్ఫూర్తి. ఈ స్ఫూర్తి ప్రాతిపదికగా మనం కాలంతో పాటు కలిసి మరిన్ని విజయాల కోసం ప్రయాణం చేద్దాం; ప్రయత్నం చేద్దాం.
– రోచిష్మాన్
9444012279
అంతర్జాతీయ కవి, విశ్లేషకుడు, కాలమిస్ట్, జెమలిజిస్ట్