సెప్టెంబర్ 18న ఆదేశాలు, వెంటనే అమల్లోకి వచ్చిన కొత్త రూల్స్
రైలు ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబానికి ఇకపై రూ.5 లక్షల పరిహారం
తీవ్ర గాయాలపాలైతే రూ.2.5 లక్షలు, స్వల్పంగా గాయపడితే రూ.50 వేల పరిహారం
30 రోజులకు మించి ఆసుపత్రిలో ఉంటే రోజుకు రూ.3 వేలు చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లింపు
Railway Board : రైలు ప్రమాదాల్లో గాయపడినా, మరణించినా ఇచ్చే పరిహారాన్ని పది రెట్లకు పెంచుతూ రైల్వే బోర్డు సెప్టెంబర్ 18న ఆదేశాలు జారీ చేసింది. ఈ కొత్త నిబంధనలు తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొంది. బోర్డు నిర్ణయం ప్రకారం రైలు ప్రమాదాలతో పాటు కాపలాదారులున్న లెవెల్ క్రాసింగ్ వద్ద జరిగే ప్రమాదాలకు పెంచిన పరిహారం వర్తిస్తుంది.
రైల్వే బోర్డు ఉత్తర్వుల ప్రకారం, రైలు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబసభ్యులకు ప్రస్తుతం ఇస్తున్న రూ.50 వేల పరిహారాన్ని రూ.5 లక్షలకు పెంచారు. తీవ్రంగా గాయపడిన వారికి ఇచ్చే పరిహారాన్ని రూ.25 వేల నుంచి 2.5 లక్షలు చేశారు. స్వల్పంగా గాయపడినప్పుడు ఇచ్చే పరిహారాన్ని రూ.5 వేల నుంచి రూ.50 వేలు చేశారు. ఉగ్రదాడులు, హింసాత్మక ఘటనలు, రైళ్లలో దోపిడీలు వంటి అవాంఛిత ఘటనల సమయంలో ఈ పరిహారాలు వరుసగా రూ.1.50 లక్షలు, రూ.50 వేలు, రూ. 5 వేలుగా నిర్ణయించారు.
ఇక పై రైలు ప్రమాదాల బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఖర్చులకు ఇచ్చే మొత్తాన్నీ పెంచారు. తీవ్రంగా గాయపడిన వారు 30 రోజులకు మించి ఆసుపత్రిలో ఉండాల్సి వస్తే రోజుకు రూ.3 వేల చొప్పున ప్రతి పది రోజులకు ఒకసారి ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తారు. అవాంఛిత ఘటనల విషయంలో ఈ మొత్తాన్ని రూ.1500 గా నిర్ణయించారు. అయితే, కాపలాదారులు లేని లెవెల్ క్రాసింగ్ వద్ద నిబంధనలు అతిక్రమించి ప్రమాదాలకు గురైన వారికి ఈ పరిహారం వర్తించదని రైల్వో బోర్డు స్పష్టం చేసింది.