
Bandi Sanjay : తెలంగాణలో బీజేపీ బలపడుతుందని ఆ పార్టీ నేతలు ఎంత గట్టిగా చెబుతున్నా వర్గపోరుతో రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి రెండడుగులు ముందుకు మూడడుగులు వెనక్కి అన్నట్లుగా తయారైంది. ముఖ్యంగా పార్టీలో కొత్త, పాత నేతల మధ్య విభేదాలు నాయకత్వాన్ని కలవరపెడుతున్నాయి. పాతవారిని కలుపుకుని కొత్తవారిని నియంత్రించలేక కమలదళం తల పట్టుకుంటుంది. అందుకే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడి ఇన్నాళ్లు అవుతున్నా తెలంగాణ అధ్యక్షుడి మార్పుపై బీజేపీ నిర్ణయం తీసుకోలేకపోతోంది. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా బిజీగా ఉండడం, రాష్ట్ర వ్యవహారాలు నిర్వహించడం కష్టం. అందుకే పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమిస్తామన్న బీజేపీ హైకమాండ్ హామీ ఇంకా కార్యరూపం దాల్చకపోవడానికి కారణం పార్టీలోని అంతర్గత విభేదాలేనని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే కేంద్రమంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కు మళ్లీ పార్టీ పగ్గాలు అప్పజెప్పబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఎన్నికలకు ముందు ఆయన్ను తప్పించి తప్పు చేశామన్న భావనలో కేంద్ర నాయకత్వం ఉందా…? ఈటలకు అధ్యక్ష బాధ్యతలను అప్పగించడం బండి సంజయ్ కు ఇష్టం లేదని తెలుస్తోంది. అందుకే పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో ముందున్న ఈటల రాజేందర్ కు ఆ పదవి రాకుండా బండి సంజయ్ అడ్డుకుంటున్నారని బీజేపీ శ్రేణులు అంటున్నాయి. ఈటల రాజేందర్‌కు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించడంపై బండి సంజయ్ ఒక్కరే కాదు.. బీజేపీ, ఏబీవీపీ, ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీలోని కోర్ హిందువులు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. గతంలో బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ హైకమాండ్ బండి సంజయ్‌ను పక్కన పెట్టి కిషన్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించిన సంగతి తెలిసిందే.
బండి సంజయ్‌ను పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించడానికి ఈటల రాజేందర్ కారణమనే ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. బండి సంజయ్‌తో పాటు బీజేపీలోని ఇతర నేతలు మొదటి నుంచి దీన్ని నమ్ముతున్నారు. ఈటెల కారణంగానే బండిని పార్టీ హైకమాండ్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించిందని రాష్ట్రంలోని బండి అభిమానులు, బీజేపీ కార్యకర్తలు, హిందువులు కూడా భావిస్తున్నారు. అప్పట్లో బండి వారసుడు ఈటెల అని ప్రచారం జరిగినా.. బీజేపీ అధిష్టానం కిషన్ రెడ్డికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. ఈటల రాజేందర్, బండి సంజయ్ ఇద్దరూ ఒకే జిల్లాకు చెందినవారు. కానీ ఇద్దరి రాజకీయ నేపథ్యాలు వేరు. బండి సంజయ్ ది హిందుత్వ ఎజెండా. ఏబీవీపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లో క్రియాశీలకంగా వ్యవహరించిన నాయకుడు. బీజేపీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్త. బండి ఫాలోయింగ్ జిల్లా లేదా నియోజకవర్గానికి పరిమితం కాదు. ఈటెల విషయానికి వస్తే ఆయన రాజకీయ నేపథ్యం పూర్తి భిన్నంగా ఉంటుంది. కమ్యూనిస్టు భావజాలం బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తి, ఆ పార్టీ సిద్ధాంతాలపై ఆయనకు నమ్మకం లేదు. నిజానికి ఈటల రాజేందర్ బీఆర్‌ఎస్‌ని వీడి కాంగ్రెస్‌లో చేరతారని అంతా అనుకున్నారు. అయితే అనూహ్యంగా కమలం పార్టీ కండువా కప్పుకున్నారు. రాష్ట్ర బీజేపీ ప్రధాన నేతలతో ఆయన సరిగా మెలగకపోవడానికి అదే కారణం.
అప్పుడు తనకు అధ్యక్ష పదవి రాకుండా చేసిన ఈటలకు రివేంజ్ గిఫ్ట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరికీ సయోధ్య కుదిర్చి బండికి మళ్లీ పార్టీ పగ్గాలు కట్టబెట్టాలని హైకమాండ్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్లే బండి సంజయ్ మళ్లీ యాక్టివ్ కావటం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. కేంద్రమంత్రిగా ఉన్నా, ఈ మధ్య రాష్ట్ర వ్యవహరాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఖమ్మం వరదల విషయంలోనూ పార్టీ తరఫున ఆయన పర్యటనకు రెడీ కావటం, ఈ లోపు ఈటల కూడా ముందుకు రావటంతో రెండు బృందాలుగా వెళ్తున్నారు. అయితే, బండి స్పీడ్ పెంచటంతో… ఆయన్ను మళ్లీ రాష్ట్ర బాధ్యతలకు పంపుతారా? కేంద్రమంత్రిగా ఉన్నా రాష్ట్ర పార్టీ బాధ్యతలు కూడా అప్పగించబోతున్నారా? అని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.