BJP vs Janasena :
ఏపీలో కొంత కాలంగా బీజేపీ, జనసేన పార్టీలు మిత్రబంధంతో ముందుకెళ్తున్నాయి. చీఫ్ పవన్ కళ్యాణ్ బీజేపీ అగ్రనేతలతో సఖ్యతతో వ్యవహరిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు టీడీపీతో కలిసి పోటీకి సన్నద్ధమవుతున్నాయనే చర్చ సాగుతున్నది. అయితే ఈ క్రమంలో టీటీడీ శ్రీవారి ట్రస్ట్ నిధుల వ్యవహారం జనసేన, బీజేపీ మధ్య చిచ్చు పెట్టినట్లు కనిపిస్తున్నది.
శ్రీవాణి ట్రస్ట్ పేరుతో రూ. పది వేల విరాళం ఇస్తే వీఐపీ బ్రేక్ దర్శనం టిక్కెట్ ను రూ. ఐదు వందలకు ఇస్తున్నారు. ఆ పది వేల విరాళం లెక్కలు బయటకు చెప్పడం లేదని కొంతకాలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో వైసీపీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి అనుమానాలు ఉన్న సమయంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి దీనిపై మాట్లాడారు. శ్రీవాణి ట్రస్టులో విరాళాలు ప్రక్కదారి పట్టడం లేదని, వీటిని హిందూ దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలు, నిర్మాణాలకే వినియోగిస్తున్నారని చెప్పారు. అనవసరంగా రాజకీయం చేయెద్దని వైసీపీ నేతలా మాట్లాడారు. ఇది విని బీజేపీ నేతలు కూడా ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు. అయితే బీజేపీ వైసీపీకి లోపాయికారిగా సహకరిస్తున్నదన్న వాదనలు వినిపిస్తున్న సమయంలో ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి. వెంటనే జనసేన నాయకులు రంగంలోకి దిగారు. బీజేపీ పై ఎదురుదాడికి దిగారు. భానుప్రకాశ్ రెడ్డి బీజేపీలో ఉన్నారా.. లేదంటే వైసీపీలో చేరారా అంటూ జనసేన నేత కిరణ్ రాయల్ ప్రశ్నించారు.
భానుప్రకాష్ రెడ్డి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అధికార ప్రతినిధిలా మాట్లాడారని ఎద్దేవా చేశారు. శ్రీవాణి ట్రస్టుకు రూ. 1100 కోట్లు వచ్చాయని భానుప్రకాష్ రెడ్డి అంటే , వైవీ సుబ్బారెడ్డి మాత్రం ఎనిమిది వందల కోట్లు మాత్రమే వచ్చాయని చెప్పారని పేర్కొన్నారు. మిగిలిన మూడు వందల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్లాయో చెప్పాలని కిరణ్ రాయల్ ప్రశ్నించారు.అధికార పార్టీ నేతలు స్పందించకుండా, బీజేపీ నేత స్పందించడం అనుమానాలకు తావిస్తున్నదని మండిపడ్డారు. అయితే ఈ వ్యవహారం ఇప్పుడు రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టేలా కనిపిస్తున్నది. ప్రభుత్వం తీరుపై జనసేన పోరాడుతుంటే, మిత్రపక్షమైన బీజేపీ మెతకవైఖరి అవలంబిస్తుండడం వివాదాలకు తావిస్తున్నది.