GPS Girl : ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిపోయింది. ఇండియాలో లేవడం.. దుబాయ్ లో టిఫిన్.. లండన్ లో లంచ్.. అమెరికాలో డిన్నర్ చేస్తున్న రోజులు ఇవీ.. అంత వేగంగా ప్రపంచం మొత్తం తిరిగేస్తున్నాం. ఇక ఏ దేశంలో ఎక్కడ ఉన్నా.. అడ్రస్ ఈజీగా తెలుసుకోవచ్చు. వెళ్లిపోవచ్చు.. కేవలం మన ఫోన్లో ‘జీపీఎస్’ ఉంటే చాలు ఎక్కడికైనా వెళ్లిపోతున్న పరిస్థితి. హైదరాబాద్ వంటి మహానగరంలోనూ జీపీఎస్ తో ఏ సందు మూలకైనా వెళ్లిపోతున్న రోజులు ఇవి.
ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ లేకపోతే బతకలేని పరిస్థితులు వచ్చాయి. ముఖ్యంగా జీపీఎస్ మన జీవితాలను, ప్రయాణాలను సులభతరం చేసేసింది. జీపీఎస్ లేకపోతే బయట బతకడం.. ప్రయాణించడం కష్టంగా మారింది. ఈరోజుల్లో అడ్రస్ అడిగితే ఎవరూ చెప్పరు. అంత తీరిక, ఓపిక ఎవరికీ లేదు. అందుకే జీపీఎస్ ఆన్ చేసి వెళ్లిపోతున్నాం. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ లేకపోయినా.. జీపీఎస్ లేకపోయినా బతకడం చాలా కష్టంగా మారింది..
స్మార్ట్ ఫోన్ లో మనం జీపీఎస్ ఆన్ చేసి ఏదైనా ప్రదేశానికి వెళ్లినప్పుడు ఒక అమ్మాయి గొంతు వినిపిస్తూ ఉంటుంది. ‘గో లెఫ్ట్.. రీచ్డ్ డెస్టినేషన్’ అంటూ శ్రావ్యమైన గొంతుతో మనకు సూచనలు చేస్తూ ఉంటుంది. అమె ఎవరో తెలుసుకోవాలన్న కుతూహలం చాలా మందికి ఉంటుంది. తాజాగా ఆమె ఎవరన్నది బయటపడింది. ఆ జీపీఎస్ గొంతు మరి ఎవరిదో కాదు ‘కారెన్ జకాబ్సన్’ దే..
-ఎవరీ కారన్ జకాబ్సన్.?
కారెన్ ఆస్ట్రేలియాలోని మాకే నగరంలో నివసిస్తోంది. ఈమె ఆస్ట్రేలియాలోనే పుట్టి పెరిగింది. కారెన్ వాయిస్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు సింగర్, రచయిత్రి కూడా.. 2002లో ఆమెకు జీపీఎస్ వాయిస్ ఆర్టిస్ట్ గా ఉద్యోగం వచ్చింది. కారెన్ వాయిస్ గూగుల్ మ్యాప్స్ కు సెట్ అవుతుందని భావించడంతో గూగుల్ సంస్థ ఆమె వాయిస్ ను గూగుల్ మ్యాప్స్ లోని నావిగేషన్ లో ఏర్పాటు చేసింది.
-జీపీఎస్ కోసం 50 గంటలు కష్టపడ్డ కారెన్
జీపీఎస్ సిస్టమ్ లో ఎన్నో సూచనలు ఉంటాయి. సందర్భానుసారం వాటిని గూగుల్ మ్యాప్స్ వినిపిస్తూ ఉంటుంది. అందుకే ఈ జీపీఎస్ సిస్టమ్ కోసం కారెన్ దాదాపు 50 గంటలు తన వాయిస్ ను రికార్డ్ చేసిందట.. ప్రతీ మలుపు, కొండ.. క్రాసింగ్ ఇలా అన్నింటికి వాయిస్ లు చెప్పేసింది. ప్రస్తుతం ఏ స్మార్ట్ ఫోన్ లో నైనా కారెన్ గొంతే వినిపిస్తుంది.
-అన్నింట్లోనూ కారెన్ గొంతే..
కారెన్ కేవలం ఒక్క జీపీఎస్ లో మాత్రమే కాదు.. చాలా మంది చాలా వాటిల్లో వాడేశారు. ఎలివేటర్లు, సినిమా థియేటర్లు, ఆడియో బుక్స్, సాఫ్ట్ వేర్ అప్లికేషన్స్ లోనూ ఆమె సేవలు అందించారు. విశేషం ఏంటంటే ఆస్ట్రేలియాలో ఐఫోన్ లో వచ్చే ‘సిరి’ వాయిస్ కూడా కారెన్ దే. దీంతో ఈమె వాయిస్ కు ఫిదా అయిపోయి జనాలు అంతా కారెన్ ను ‘జీపీఎస్ గర్ల్’ అంటూ ముద్దుగా పిలుస్తుంటారు.