
YCP MLAs : ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం తీసుకున్ననిర్ణయాలు బెడిసి కొడుతున్నాయి. పార్టీ బలోపేతం కోసం పలు సీట్లను మార్చడంతో నేతల్లో అసహనం పెరిగింది. దీంతో దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. ఎమ్మెల్యేల్లో వచ్చిన తిరుగుబాటుతో అధిష్టానం దిగి రాక తప్పలేదు. ఎమ్మెల్యేలను వారి స్థానాలను మారుస్తూ తీసుకున్న నిర్ణయంతో వారిలో ఆగ్రహం పెరగడంతో జగన్ వారి అభీష్టం మేరకు నడుచుకునేందుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
నియోజకవర్గాల సమన్వయకర్తల విషయంలో చేసిన ప్రయోగాలు బెడిసికొట్టడంతో రివర్స్ అయింది. తిరుపతి సిట్టింగ్ ఎంపీ మద్దిల గురుమూర్తిని సత్యవేడు అసెంబ్లీ సమన్వయకర్తగా నియమించారు. సత్యవేడులో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలం సురేష్ ను తిరుపతి లోక్ సభకు మార్చారు. దీంతో ఆయన లోకేష్ ను కలవడంతో జగన్ కు షాక్ తగిలింది. దీంతో సిట్టింగులను మార్చాలనే నిర్ణయానికి తాత్కాలికంగా విరామం ఇచ్చినట్లు తెలుస్తోంది.
గురుమూర్తిని తిరుపతి లోక్ సభకే మారుస్తున్నట్లు వైసీపీ బుధవారం ప్రకటించడం గమనార్హం. మూడు అసెంబ్లీ, నాలుగు లోక్ సభ నియోజకవర్గాల సమన్వయకర్తలతో జాబితా విడుదల చేసింది. సత్యవేడులో శాసనసభ మాజీ ఉపసభాపతి కుతూహలమ్మ సోదరి కుమారుడు నూకతోటి రాజేష్ ను నియమించింది. దీంతో జగన్ లో వణుకు మొదలైంది.
ఇప్పుడు వైసీసీ తీసుకుంటున్న నిర్ణయాలతో మిగతా వారు కూడా ఇతర పార్టీల్లోకి వెళ్లాలనే ఆలోచనకు స్వస్తి పలకాలని చూస్తున్నారు. అధిష్టానం తమ భవిష్యత్ కోసం దిగి రావడంతో ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారే యోచనను మానుకోవాలని చూస్తున్నారు. ఈనేపథ్యంలో ఏపీలో పలు మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా ఏ పరిణామాలు చోటుచేసుకుంటాయో తెలియడం లేదు.