Skill Development Case :
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఐడీ పెట్టిన స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో ఆధారాలు లేవని, కేవలం అభియోగాలు మాత్రమేననే అభిప్రాయం అన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నది. గత టీడీపీ ప్రభుత్వం సిమెన్స్ అనే సంస్థతో పారదర్శకంగా ఒప్పందం చేసుకుందని, కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇంకా ఇందులో అవినీతి ఆస్కారం ఏం ఉంటుందనే అభిప్రాయం వినిపిస్తున్నది.
అయితే ఒప్పందంలో సంతకాలు చేసిన అధకారులను వదిలి, అసలు ఒప్పంద సమయంలో ఉన్న సీఎంను ఇందులో ఇరికించి, రాజకీయంగా లబ్ధి పొందే కుట్రలకు వైసీపీ తెరదీసిందని, ఇందుకోసం ఏపీ సీఐడీని పావుగా వాడుకుంటున్నదనే అభిప్రాయం వినిపిస్తున్నది. తమ చేతిలో అధికారం ఉందని, ఇటు సీఐడీ, అటు ఏఏజీని వాడుకొని టీడీపీ అధినేత చంద్రబాబును ఇరికించే ప్రయత్నం చేస్తున్నారనే టాక్ వినిపిస్తున్నది. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు సీఐడీ చేసింది అభియోగాలు మాత్రమే. ఇందులో ఆధారాలు ఒక్కటి కూడా కోర్టులో ప్రవేశపెట్టలేదు.
అయితే ఆధారాలు ఉన్నాయని ఇటు సీఐడీ అధికారి సంజయ్, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి అనుమానాలకు తావిస్తున్నారు. అయితే విజయవాడలోనే కాకుండా ఏకంగా ఢిల్లీకి వెళ్లి ప్రెస్ మీట్లు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని, వీళ్లు రాజకీయ నాయకుల్లా కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని అంతా మండిపడుతున్నారు. అయితే ఇప్పటివరకు ఆధారాలు ఉన్నాయని చెప్పడం మినహా, ఏ ఒక్క ఆధారాన్ని వారు చూపెట్టలేకపోయారని టీడీపీ వాదిస్తున్నది. ఇలాంటి సందర్భంలో ప్రతి సామాన్యుడికి చంద్రబాబు పై పెట్టిన కేసు విషయంలో అనుమానాలు వస్తూనే ఉన్నాయి. చంద్రబాబు నిర్దోషి అని నమ్మిన వారంతా ఇప్పుడు రోడ్లపైకి వచ్చి పోరాడుతున్నారు. ఆయనను విడుదల చేయాలని కోరుతున్నారు. అయితే ఆందోళన తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆధారాలు సేకరించే పనిలో పడింది. చంద్రబాబును ఎలాగైనా ఈ కేసులో బుక్ చేయాలని భావిస్తున్నది. అయితే ఈ రోజు హైకోర్టు, ఏసీబీ కోర్టుల్లో జరిగే వాదనలతో తీర్పు ఎలా ఉంటుందనే విషయంతో అంతా తేలిపోనుంది.