
immigrant : అమెరికా నుంచి అమృత్‌సర్‌కు సి-17 యుద్ధ విమానం ల్యాండ్ అవడం మాత్రమే మనం చూశాం. కాని, అందులో ప్రయాణించిన వచ్చిన వారి కథ, వాళ్లు అనుభవించిన నరక యాతన వర్ణనాతీతం.. పంజాబ్‌లోని ఓ చిన్న గ్రామంలో ఉండే జస్పాల్ సింగ్.. తన స్టోరీ చెప్పుకొని కన్నీళ్ల పర్యంతం అయ్యాడు. ఆయన కూడా సి-17 యుద్ధ విమానంలో వచ్చిన వ్యక్తే.
అమెరికా వెళ్లేందుకు వీసా రాకపోవడంతో.. ఎలాగోలా బ్రెజిల్ వచ్చేయండి, మిగతాది మేం చూసుకుంటాం అని చెప్పారట. ఢిల్లీ నుంచి ఖతార్‌కు తీసుకెళ్లి.. అక్కడ్నుంచి బ్రెజిల్ వెళ్లగలిగాడు. బ్రెజిల్ వెళ్లాక నేరుగా అమెరికాకు విమానంలో పంపిస్తారని ఎదురుచూస్తుంటే.. ఓ ట్యాక్సీ ఎక్కించి కొలంబియాకు, అట్నుంచి పనామాకు తీసుకెళ్లారు. ఆ తరువాత.. షిప్‌లో అమెరికా చేరుస్తాం అన్నారు. కాని, అక్కడా అలా జరగలేదు. రెండు రోజుల పాటు ఎవరికీ కంటపడని రూట్‌లలో తీసుకెళ్లారు. ఆ సమయంలోనే పర్వతాలు కూడా ఎక్కించారు. ఆ ప్రయత్నంలోనే ఇందాక చెప్పుకున్నట్టు దారిమధ్యలోనే కొందరు చనిపోయారు. ఇక మెక్సికో సరిహద్దుకు ఓ చిన్న బోటులో కుక్కించి తీసుకెళ్లారు. అది బోల్తా కొట్టి మరొకరు చనిపోయారు. ఇంత దారుణ పరిస్థితుల్లో ప్రయాణించి.. మెక్సికో సరిహద్దు ద్వారా అమెరికాలోకి ప్రవేశిస్తున్నాం అనుకునేంత లోపే మరో ఊహించని సీన్ ఎదురైంది. ఓ వ్యక్తి అమెరికా అధికారులకు పట్టుబడడంతో.. అందరినీ ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేశారు. చీకటి గదుల్లో ఉంచారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పరు. చివరకు అమృత్‌సర్ వచ్చేప్పుడు కూడా విమానం ఎక్కించి, కాళ్లు, చేతులకు గొలుసులతో సంకెళ్లు వేశారు. కిందకు దిగేవరకు కూడా నాకు తెలియదు.. నేను భారత్‌కు వచ్చానని..! అంటూ జస్పాల్ సింగ్ ఆవేదన ఇప్పుడు అందరికీ కంటతడి పెట్టిస్తోంది.






