
carpet Road : మహారాష్ర్టలో ఓ రోడ్డుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం దానిపై ట్రోలింగ్ కొనసాగుతున్నది. నెటిజన్లు అక్కడి సర్కారు తీరుపై సెటైర్లు వేస్తున్నారు. ప్రతిపక్షాలు సర్కారు తీరుపై మండిపడుతున్నాయి. స్థానికులు ఇదేం రోడ్డంటూ సదరు కాంట్రాక్టర్ తీరుపై దుమ్మెత్తి పోస్తున్నారు.
అయితే ఈ వీడియో మహారాష్ర్ట కు చెందినదిగా వైరల్ అవుతున్నది. ఇందులో ఉన్న కొందరు వ్యక్తులు కొత్తగా వేసిన రోడ్డును కార్పెట్ లా మలుస్తున్నారు. చేతులతో ఎత్తి పైకి పట్టుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం, అధికారుల తీరుపై ఆరోపణలు చేశారు. కాంట్రాక్టర్ రానా ఠాకూర్ పేరును వెల్లడిస్తున్నారు. అయితే మహారాష్ర్టలోని జల్నా జిల్లా అంబాద్ తాలుకా కజ్రత్ హస్త్ పోఖరి ప్రాంతానికి చెందిన రోడ్డుగా సోషల్ మీడియాలో చర్చ సాగుతున్నది. పీఎం గ్రామీణ సడక్ యోజన కింద ఈ రోడ్డును వేశారు. అయితే జర్మనీ టెక్నాలజీతో ఈ రోడ్డును వేసినట్లుగా సదరు కాంట్రాక్టర్ చెబుతున్నాడు. ఈ వ్యవహారంపై స్థానికులు మహారాష్ర్ట ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇందులో బాధ్యలందరినీ శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే ప్రపంచంలోనే ఇప్పటివరకు కనీవిని ఎరగని రోడ్డని కొందరు… ఇదేందయా ఇది నేనెప్పుడూ సూడలా.. అంటూ మరికొందరు నభూతో నభవిష్యత్ అంటూ ఇంకొందరు.. చరిత్రలో నిలిచిపోతుందని.. అద్భుత కళా ఖండమని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా ఇది నెట్టింట వైరల్ గా మారింది. ఇది మహారాష్ర్ట సర్కారు సాధించిన గొప్ప విజయమని సెటైర్లు పడుతున్నాయి. ఇప్పటికైతే దీనిపై అధికారుల నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.
जालना: माॅडेल रस्त्याचे स्वप्न दाखवून केला बोगस रस्ता; गावकऱ्यांनी व्हिडीओ काढून केली कंत्राटदारासह अधिकाऱ्यांची पोलखोल. pic.twitter.com/9rQjDr3yvb
— Lokmat (@lokmat) May 30, 2023