Sudarshan Setu : గుజరాత్‌లోని ఓఖాను బేట్ ద్వారక ద్వీపాన్ని కలిపే నాలుగు లైన్ల కేబుల్-స్టేడ్ వంతెన ‘సుదర్శన్ సేతు’ను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం (ఫిబ్రవరి 25) ప్రారంభించారు. వంతెన 2.32 కిలో మీటర్లు విస్తరించి ఉంది. సెంట్రల్ డబుల్-స్పాన్ కేబుల్-స్టేడ్ భాగం 900 మీటర్లు, 2.45 కిలోమీటర్ల పొడవు అప్రోచ్ రోడ్డును కలిగి ఉంటుంది.
రూ. 979 కోట్లతో నిర్మించిన ఈ వంతెన 27.20 మీటర్ల వెడల్పుతో, ఇరువైపులా 2.50 మీటర్ల వెడల్పుతో ఫుట్‌పాత్‌లను కలిగి ఉంది. వాస్తవానికి ‘సిగ్నేచర్ బ్రిడ్జి’గా పిలిచే ఈ నిర్మాణాన్ని ‘సుదర్శన్ సేతు’ లేదా ‘సుదర్శన్ బ్రిడ్జి’ అని పేరు పెట్టినట్లు జిల్లా మేజిస్ట్రేట్ (DM) GT పాండ్య తెలిపారు.
ద్వారక నుంచి సుమారు 30 కిలో మీటర్ల దూరంలో ఓఖా నౌకాశ్రయానికి సమీపంలో ఉన్న బేట్ ద్వారక, శ్రీకృష్ణుడి పూజ్యమైన ద్వారకాదీష్ దేవాలయానికి నిలయం. ప్రస్తుతం, బేట్ ద్వారకాలోని ఆలయానికి వెళ్లే భక్తుల కోసం పగటిపూట పడవ ప్రయాణాలకు మాత్రమే అనుమతిస్తారు. వంతెన నిర్మాణం పూర్తవడంతో, ఆలయానికి రౌండ్-ది క్లాక్ యాక్సెస్‌బిలిటీని కలుగుతుంది.
సుదర్శన సేతు ప్రారంభోత్సవం తర్వాత ప్రధాని జామ్‌నగర్, దేవభూమి ద్వారక, పోర్‌బందర్ జిల్లాల్లో 533 కిలో మీటర్ల రైల్వే లైన్ విద్యుదీకరణ, పెట్రోలియం మంత్రిత్వ శాఖ కింద 2 ఆఫ్‌షోర్ పైప్‌లైన్ల ప్రారంభోత్సవంతో సహా వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.