
White hair black : ఆయర్వేదంలో గుంటగలగర ఆకుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. దీన్ని ఎన్నో మందుల్లో ఉపయోగిస్తారు. జుట్టు సమస్యలకు ఇది చక్కని పరిష్కారంగా చెబుతారు. దీంతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఆ మధ్యన ఏపీకి చెందిన ఆనందయ్య కరోనాకు కనిపెట్టిన మందులో దీన్ని వాడినట్లు తెలిసిందే. ఈ నేపథ్యంలో గుంటగలగర ఆకు విశిష్టత తెలిస్తే దాన్ని వదిలిపెట్టం.
ప్రాచీన ఆయుర్వేద గ్రంథాల్లో దీని గురించి ఎన్నో విషయాలు చెప్పారు. అధర్వణ వేదంలో కూడా దీని ప్రస్తావన ఉందంటే ఇది ఎంత శక్తివంతమైనదో అర్థమవుతుంది. దీన్ని వాడితే వందేళ్ల ఆయువు మనకు అందిస్తుందని ఆయుర్వే నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో నుంచి వెలువడే రసాయనంతో ఎన్నో రకాల రోగాలకు చక్కని మందును తయారు చేసుకోవచ్చు.
పూర్వ కాలంలో గుంటగలగర మొక్క గురించి తెలుసుకుని తలవెంట్రుకల కోసం దీన్ని విరివిగా వాడేవారు. తెలుగులో దీన్ని గుంటగలగర అని వేదభాషలో భ్రుంగరాజ లేదా కేశరాజ అని పిలుస్తుంటారు. ఇది సాధారణంగా నీటి కుంటల పక్కన, తేమ ఉన్న ప్రదేశాల్లో లభిస్తుంది.
దీన్ని పలు నూనెల కంపెనీలు తమ ఉత్పత్తుల్లో వాడుతున్నాయి. వెంట్రుకలు రాలిపోకుండా ఉండాలంటే దీంతోనే సాధ్యమని భావిస్తున్నాయి. నూనెల్లో దీన్ని వాడుకుని జుట్టు రాలిపోకుండా, తెల్లబడకుండా చేసుకోవాలని చెప్పుకుంటున్నాయి. దీంతో గుంటగలగర ఆకు ప్రాధాన్యం తెలియడంతో దీన్ని అందరు వాడుకుని జుట్టుకు సంబంధించిన సమస్యలు దూరం చేసుకోవాలని ఆశిస్తున్నారు.