Shobhita Dhulipala : అక్కినేని నాగచైతన్య, గ్లామరస్ నటి శోభితా ధూలిపాళ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న నేపథ్యంలో వీరి నిశ్చితార్థం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ లో ఉంటున్న నాగచైతన్య ముంబైలో ఉంటున్న శోభితతో ఎక్కువ సమయం ప్రైవేట్ గా గడుపలేకపోతున్నారు. నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి శోభిత అతనితో గడిపేందుకు తరచూ ముంబై- హైదరాబాద్ మధ్య ప్రయాణిస్తోంది.
నటిగా చాలా బిజీగా ఉన్న శోభితా అదే సమయంలో మోడల్ గా మంచి విజయాలను కూడా అందుకుంది. వివిధ ఫ్యాషన్, ట్రావెల్, లైఫ్ స్టైల్ మ్యాగజైన్ల కోసం ఆమె అనేక ఫొటోషూట్లు చేస్తూనే ఉంది. అలాంటి ఫొటో షూట్ అవకాశాలను శోభిత ఇప్పుడు తిరస్కరిస్తోందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నిర్ణయం కొన్ని ఊహాగానాలకు దారి తీసినా అది ఆమె వ్యక్తిగత నిర్ణయమని తెలుస్తోంది.
నాగ చైతన్యతో నిశ్చితార్థం తర్వాత ఆమె చేసిన కొన్ని బోల్డ్ ఫొటోషూట్లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె నట జీవితం త్వరలోనే ముగిసిపోతుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. నాగచైతన్య, సమంతల విడాకుల సమయంలో దీనికి ప్రధాన కారణం సమంత నటజీవితానికి సంబంధించినదని పుకార్లు వచ్చాయి. ఆమె చేసిన కొన్ని హాట్ రోల్స్, స్పెషల్ సాంగ్స్ కి అక్కినేని ఫ్యామిలీ నుంచి పెద్దగా ఆదరణ లభించలేదని. ఈ విషయంలో చైతన్య ఆమెకు సపోర్ట్ చేయకపోవడం వల్ల వారు విడిపోయారని అంటున్నారు.
సమంతతో నాగచైతన్య గత వివాహం గురించి ఇలాంటి కథనాలు రావడంతో అక్కినేని కుటుంబం శోభితకు షరతులు విధించే అవకాశం ఉందని కొన్ని రూమర్లు సూచిస్తున్నాయి. అయితే అక్కినేని కుటుంబం నుంచి అలాంటి ఆంక్షలేవీ లేవని విశ్వసనీయ వర్గాలు ధృవీకరించాయి. ఫొటోషూట్ల నుంచి కాస్త విరామం తీసుకోవాలని శోభిత నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఇలాంటి రూమర్లు ఉన్నప్పటికీ శోభిత పెళ్లి తర్వాత కూడా తన నటజీవితాన్ని కొనసాగించాలని భావిస్తోంది. నిశ్చితార్థం తర్వాత ఆమె నటించిన తొలి చిత్రం లవ్ సితార సెప్టెంబర్ 27న జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఇదిలా ఉంటే నాగచైతన్య ప్రస్తుతం తాండేల్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది చివరలో రాజస్థాన్ లో జరిగే రాజ వేడుకలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి.