
Kapu Votes : కుల రాజకీయాలకు పెట్టింది పేరు ఆంధ్రప్రదేశ్. ఏపీలో ప్రధానంగా రెడ్లు, కమ్మ సామాజిక వర్గాలు రాజకీయాలతో పాటు ఇతర రంగాలను శాసిస్తున్నాయి. అయితే ఇక్కడ మరో బలమైన సామాజిక వర్గం కాపులు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని 5 కోట్ల జనాభాలో కాపులు దాదాపు 15% ఉన్నారు. వారు ఏకమైతే రాజకీయ పార్టీ భవితవ్యాన్ని నిర్ణయించవచ్చు.
తెలుగుదేశం కమ్మ సామాజికవర్గంగా గుర్తింపు పొందగా, రెడ్డిలు కాంగ్రెస్ వైపు నిలిచారు. ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ ఉనికి ప్రశ్నార్థకం కాగా, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ వైపు రెడ్లు మొగ్గు చూపుతున్నారు. ఆ రెండు పార్టీలు తమ సామాజిక వర్గాలకు పెద్ద పీట వేస్తున్నాయి.
కాపులకు రాజకీయ ప్రయోజనాలు దక్కడం లేదనే చర్చ మొదలైంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ది కాపు సామాజిక వర్గం. పవన్ కల్యాణ్ కాపు సామాజిక వర్గాన్ని తన వైపునకు తిప్పుకోవడం అంతగా సక్సెస్ కావడం లేదు.
పొత్తు కుదిరినా నమ్మకం తక్కువే..
రానున్న ఎన్నికల్లో పవన్ కల్యాణ్ టీడీపీ తో పొత్తు పెట్టుకుంటాడని రాజకీయ విశ్లేషకలుు భావిస్తున్నారు. పవన్ సొంతంగా బరిలోకి దిగాలనుకున్నా ఇప్పటి వరకైతే ఆ పార్టీకి అభ్యర్థులు కూడా లేరు. పరిమిత స్థానాల్లో జనసేన పోటీ చేయాల్సి వస్తుంది.
ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటుతో కాపులంతా చిరంజీవి వైపే నిలిచారు. కానీ అనుకున్న స్థాయిలో చిరంజీవికి సీట్లు రాకపోవడంతో ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. అనంతరం పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో కాపులంతా మెగా ఫ్యామిలీకి యాంటీగా మారారు. తమకు రాజకీయంగా ప్రాధాన్యం కల్పిస్తారనుకుంటే ఇలా రెడ్ల పంచన చేరారంటూ కాపులు ఆగ్రహం పెంచుకున్నారు. 2019 ఎన్నికల్లో జనసే విడిగా పోటీ చేసి సాధించింది ఏమీ లేదు. తమకు పవన్ కల్యాణ్ తో ఒనగూరేది ఏమీలేదని కాపు వర్గాల భావన.
బీసీలకు టీడీపీ పెద్దపీట..
ఎన్టీఆర్ టీడీపీ ఏర్పాటు చేసే వరకు కాపులంతా కాంగ్రెస్ వైపే ఉన్నారు. టీడీపీ ఆవిర్భావంతో కాపులంతా తెలుగు దేశం పార్టీకి జైకొట్టారు. ఎన్టీఆర్ కూడా బీసీలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఎన్టీఆర్ మరణానంతరం కాపులు తిరిగి కాంగ్రెస్ కు దగ్గరయ్యారు. ప్రస్తుతం మాజీ సీఎం చంద్రబాబు బీసీలకు పెద్ద పీట వేస్తుండడంతో కాపులంతా టీడీపీ వైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా జనసేన తో తమకు కలిగే ప్రయోజనం ఏమీ లేదని కాపులు భావిస్తున్నారు. అయితే టీడీపీకి తమ డిమాండ్లను ముందు పెట్టాలని కాపులు యోచిస్తున్నట్లు సమాచారం.