
Trouble with KCR : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ సీఎం అని పేరు సంపాదించుకున్నాడు. 2014లో సీఎం అయినప్పటి నుంచి తొమ్మిదేళ్లుగా సచివాలయంలోని తన కార్యాలయం నుంచి పనిచేయడం చాలా తక్కువనే చెప్పాలి. బేగంపేటలోని ప్రగతి భవన్ లేదంటే నగర శివార్లలోని ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్ నుంచి పని చేసి ‘వర్క్ ఫ్రమ్ హోమ్ సీఎం’గా పేరు సంపాదించుకున్నారు కేసీఆర్.
ప్రమాదకరమైన వాస్తు లోపాలే కారణమని పేర్కొంటూ 2014 నుంచి 2020 వరకు పాత సచివాలయానికి సీఎం కేసీఆర్ దూరంగా ఉంటూ వచ్చారు. 2020 జూలైలో పాత సచివాలయాన్ని కూల్చివేసి దాని స్థానంలో కొత్తది నిర్మించారు. ఈ ఏడాది ఏప్రిల్ 30న కొత్త సచివాలయం ప్రారంభమైనప్పటి నుంచి కేసీఆర్ ప్రతిరోజూ కాకపోయినా తరచూ సందర్శిస్తూ వస్తున్నారు. 15 రోజుల్లో సుమారు 23 రోజులు సచివాలయానికి వచ్చి తన కార్యాలయం నుంచి విధులు నిర్వర్తించారు. అయితే సీఎం కార్యాలయంలో ఉండడం సిబ్బందికి, అధికారులకు, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తోంది.
ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేసే రెగ్యులర్ ఉద్యోగులు, అధికారులకు భిన్నంగా కేసీఆర్ అసాధారణ సమయాల్లో సచివాలయానికి వస్తుంటారు. కేసీఆర్ సాధారణంగా సాయంత్రం 5 గంటల తర్వాత వచ్చి రాత్రి 8 లేదా 10 గంటల వరకు సచివాలయంలోనే ఉంటారు. దీంతో కొందరు ఉద్యోగులు, అధికారులు సీఎం వెళ్లేంత వరకు సచివాలయంలోనే ఉండిపోవాల్సి వస్తోందని, ఏ ఫైళ్లను ఆయన సమీక్షిస్తారో, ఏ ఫైళ్లను అడుగుతారో తెలియక సతమతమవుతున్నారు.
అంతేకాకుండా సీఎం కాన్వాయ్ వెళ్లేందుకు పోలీసులు విధించిన ట్రాఫిక్ ఆంక్షలతో బేగంపేట నుంచి సచివాలయానికి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మాసాబ్ ట్యాంక్, ఖైరతాబాద్, సైదాబాద్, ట్యాంక్ బండ్, రాణిగంజ్ పరిసర ప్రాంతాల్లో ఈ రద్దీ కనిపిస్తోంది. సీఎం ఇంటి నుంచే పనిచేసిన కాలంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉండేవి కావు. ఇప్పుడు కేసీఆర్ మళ్లీ ఆఫీసు నుంచి విధులకు హాజరుకావడంతో సాయంత్రం వేళల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.