
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో ఏ ఇద్దరు కలిసినా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులపైనే మాట్లాడుతున్నారు.టీడీపీ అధినేత చంద్రబాబు- పవన్ కల్యాణ్ భేటీతో ఏపీలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ప్రకటన లాంఛనంగానే మారింది. ఈ ఇద్దరితో బీజేపీ కలిసే అంశం పైన ఇప్పుడు ఆసక్తి నెలకొంది.
రెండు పార్టీలు పొత్తులపై ఒక నిర్ణయానికి వచ్చినా జనసేన మిత్ర పక్షo అయిన బీజేపీ కోసం కూడా తమతో కలిసి వస్తుంది అనీ వేచి చూసే ధోరణిలో ఉన్నారు.చంద్రబాబుతో పవన్ కల్యాణ్ సమావేశం పైన బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ స్పందించారు. జనసేన తమ మిత్రపక్షమైనా జనసేన ఒక స్వతంత్ర పార్టీగా పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ ఏ పార్టీతో అయినా చర్చించవచ్చు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై పవన్ ప్రతిపక్ష ఓట్లు చీలిపోకూడదన్నది పవన్ ప్రయత్నంగా సత్యకుమార్ చెప్పుకొచ్చారు.
పవన్ కల్యాణ్, చంద్రబాబుతో జరిపిన చర్చలు ప్రజాస్వామ్యంలో తప్పు కాదన్నారు. ఢిల్లీలోని బీజేపీ అగ్రనేతలతో పవన్ మాట్లాడారని సత్యకుమార్ గుర్తు చేసారు. వైసీపీ అరాచక పాలన నుంచి విముక్తి కలిగితేనే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని జనసేన, బీజేపీ భావిస్తున్నాయని పేర్కొన్నారు.వైసీపీ ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేస్తోందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా జగన్ నమ్మకద్రోహం చేశారని ఆరోపించారు.
రాబోయే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని మాజీ మంత్రి బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. వచ్చే ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేసే క్రమంలోనే పవన్ – చంద్రబాబు, పవన్ – ప్రధాని మోదీల భేటీ ముఖ్య ఉద్దేశమని చెప్పుకొచ్చారు. తాను కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటానని వెల్లడించారు. బీజేపీ అధినాయకత్వం నిర్ణయం ఆధారంగా ఏపీలో రాజకీయాల్లో కొత్త సమీకరణాలు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది.






