Tirupati Assembly Constituency Review : గ్రౌండ్ రిపోర్ట్ : తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం
వైసీపీ : భూమనకరుణాకర్ రెడ్డి
టీడీపీ : సుగుణమ్మ
జనసేన : సినీ నిర్మాత ఎన్వీ ప్రసాద్
తిరుపతి అసెంబ్లీ సీటుపై ఈసారి అన్ని పార్టీల కన్ను ఉంది. ఎలాగైనా అక్కడ గెలవాలని పావులు కదుపుతున్నారు. అధ్యాత్మిక కేంద్రం తిరుపతి అంటే తెలియని వారుండరు. దేశ, విదేశీ ప్రముఖులు ఇక్కడికి వస్తుంటారు. ఎమ్మెల్యేగా ఇక్కడ గెలిచిన వారికి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఒక్కసారి తిరుపతి నుంచి గెలిస్తే చాలు ఇక తిరుగుండదని చాలా మంది స్థానిక నేతలు అభిప్రాయపడుతుంటారు. అయితే ప్రధానంగా రెండు పార్టీల మధ్యనే ఇక్కడ పోటీ ఉంటుంది. వైసీపీ, టీడీపీల మధ్యే ఈ పోటీ ఉంటుంది. అయితే ఈసారి జనసేన అధినేత పవన్ కూడా ఇక్కడి నుంచి పోటీలో ఉంటారని టాక్ వస్తున్నది. దీంతో మూడు పార్టీల మధ్య వార్ తప్పేలా లేదు. అయితే తిరుపతి మొత్తం జనాభా 4 లక్షలు కాగా, రెండున్నర లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అయితే గతంలో ఎన్టీఆర్, చిరంజీవి కూడా తిరుపతి నుంచి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మరి ఈ సారి ద్విముఖ పోరా.. త్రిముఖ పోరా అనేది ఎన్నికల నాటికి తేలనుంది.
అధికార వైసీపీ నుంచి ప్రస్తుతం భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ పై కేవలం 700 ఓట్లతో గెలిచారు. అయితే పార్టీలో సీనియర్ అయిన భూమనకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు. దీంతో ఆయన కొంత అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే భూమన మాత్రం నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో పట్టు సాధించారు. ఇటీవల వివిధ కార్యక్రమాల్లో ఆయన యాక్టివ్ గా ఉండడం లేదు. అయితే తన కొడుకును రంగంలోకి దించుతారని ప్రచారం సాగుతున్నది. దీనికి ఊతమిస్తూ ఇటీవల ఆయన కుమారుడు అభినయ్ రెడ్డి కూడా తిరుపతిలో వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడు. ఆయన ప్రస్తుతం తిరుపతి డిప్యూటీ మేయర్ గా ఉన్నారు. అయితే ఒక కార్యక్రమంలో భూమన కరుణాకర్ రెడ్డి ఇదే విషయాన్ని ప్రస్తావించారు. వచ్చే ఎన్నికల్లో తన కొడుకు బరిలోకి దిగుతాడని చెప్పారు. అయితే అధినేత జగన్ దీనికి సమ్మతించలేదని సమాచారం. దీంతో భూమన కాస్త వెనుకకు తగ్గినట్లు తెలుస్తున్నది. ఇక ఆయనే పోటీలో ఉండేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తున్నది.
ఇక టీడీపీ నుంచి సుగుణమ్మ ఉన్నారు. ఆమె గత ఎన్నికల్లో ఓడిపోయారు. అంతకుముందు ఆమె తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నారు. అంత వైసీపీ ప్రభంజనంలోనూ సుగుణమ్మ మాత్రం కేవలం 708 ఓట్లతో ఓడిపోయారు. అయితే ఆ తర్వాత క్యాడర్ మొత్తం కొంత నైరాశ్యంలోకి వెళ్లింది. తిరుపతి కార్పొరేషన్లో 50 డివిజన్లు ఉంటే 49 డివిజన్లు వైసీపీనే గెల్చుకుంది. దీంతో భూమనను ఢీకొట్టడం ఇక సుగుణమ్మకు కష్టమేనని అంతా చర్చ జరుగుతున్నది. చంద్రబాబు కూడా ఇదే ఆలోచిస్తున్నారు. తెరపైకి మరో రెండు పేర్లు వచ్చినా వారు ఆ స్థాయిలో సెట్ కావడం లేదు. అయితే టీడీపీలో మాత్రం తిరుపతి అభ్యర్థిపై ఒక కొలిక్కి మాత్రం వచ్చినట్లు కనిపించడం లేదు. ఇప్పటికైతే సుగుణమ్మ పేరు మరోసారి పరిశీలనలో ఉంది. అయితే సుగుణమ్మ మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబు తనకే టికెట్ ఇస్తారని ధీమా తో ఉన్నారు.
మరోవైపు ఈ సారి జనసేనాని ఇక్కడి నుంచి బరిలో నిలవాలని ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు సమాచారం. ఒక వేళ అదే నిజమైతే ఇక పోరు రసవత్తరంగా మారే అవకాశం ఉంది. గతంలో జనసేన అభ్యర్థికి 12 వేల ఓట్లు వచ్చాయి. ఇక టీడీపీ, జనసేన పొత్తు అయితే ఇక పవన్ కు తిరుగుండదు. దీంతో పవన్ గెలుపు ఇక నల్లేరు మీద నడకే అవుతుంది. పవన్ ఇక్కడి నుంచే పోటీ చేయాలనుకుంటే, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా సహకరిస్తారు. టీడీపీ, జనసేన కలిస్తే ఇక లక్ష మెజార్టీ ఖాయమని జనసేన ధీమా వ్యక్తం చేస్తున్నది. అయితే సినీ నిర్మాత ఎన్వీ ప్రసాద్ కూడా జనసేన నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఏదేమైనా రెండు పార్టీలు కలిసి వెళ్తే. మాత్రం ఎవరు నిలబడినా గెలుపు ఖాయమనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. మరి రానున్న రోజుల్లో ఎట్లా చూసుకున్నా రెండు పార్టీల మధ్య ప్రధాన పోరు ఉంటుంది. అది కూడా వైసీపీ, టీడీపీ లేదా వైసీపీ, జనసేన మధ్య ఉంటుంది.