
crime ప్రముఖ ఫర్నిచర్, హోమ్ డెకార్, ఈ కామర్స్ సంస్థ పెప్పర్ ప్రై సహ వ్యవస్థాపకుడు, సీఈవో అంబరీష్ మూర్తి(51) ఇక లేరు. గుండెపోటుతో నిన్న మరణించారు. ఆయన చనిపోయిన వార్తను కంపెనీ మరో సహ వ్యవస్థాపకుడు ఆశిష్ షా ఎక్స్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. నా స్నేహితుడు అంబరీష్ మూర్తి నిన్న రాత్రి గుండెపోటుతో లేహ్ లో చనిపోయాడని ట్వీట్ చేశాడు.
అంబరీష్ మూర్తికి బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే ముంబై నుంచి లేహ్ కు బైక్ పై ప్రయాణిస్తుంటాడు. ఇందులో భాగంగానే లేహ్ కు వెళ్లిన అతడు గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. 2012లో మూర్తి పెప్పర్ ప్రై ను స్థాపించాడు. ఆన్ లైన్ లో ఫర్నిచర్, హోమ్ డెకార్ ఉత్పత్తులను విక్రయిస్తుంది. అలా వ్యాపారాన్ని డెవలప్ చేశారు.
పెప్పర్ ప్రై నెలకొల్పడానికి ముందు అంబరీష్ ఈబే భారత్, పిలిప్పీన్స్, మలేషియా దేశాల మేనేజర్ గా పనిచేశారు. అంతకుముందు ఆయన లెవీ స్ట్రాస్, బ్రిటానియా, పీ అండ్ ఎల్ వంటి సంస్థల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. డిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ లో గ్రాడ్యుయేషన్ చేసిన మూర్తి ఐఐఎం కోల్ కతాలో ఎంబీఏ పట్టా అందుకున్నారు. ఆయన చనిపోయిన వార్త తెలిసి చాలా మంది సంతాపం తెలిపారు.
అంబరీష్ మూర్తి మరణవార్త తెలిసి ఎంతో మంది వ్యాపారులు తమ సానుభూతి తెలిపారు. మంచి వ్యాపారవేత్తను కోల్పోయామని కన్నీరు పెట్టుకున్నారు. అందరితో కలివిడిగా ఉండే అంబరీష్ లేరనే వార్త కలిచి వేస్తుందని వాపోయారు. వ్యాపార ప్రపంచంలో ఎదుగుతున్న ఓ వ్యాపారవేత్తను దూరం చేసుకోవడం బాధాకరంగా ఉందని ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు.