Oh My God movie 2 : అక్షయ్ కుమార్ హీరోగా.. అమిత్ రాయ్ డైరెక్షన్ లో ‘వియాకాం 18 స్టూడియోస్’ ఓ మై గాడ్-2 నిర్మించింది. ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ ను మేకర్స్ గురువారం (ఆగస్ట్ 03)న రిలీజ్ చేశారు. రూ. 150 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు మేకర్స్ తెలిపారు. అక్షయ్ కుమార్‌తో పాటు, పంకజ్ త్రిపాఠి, యామీ గౌతమ్ లీడ్ రోల్స్ లో నటించారు.
ఆగస్ట్ 11న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. అసలు ట్రైలర్ లో ఏం ఉందంటే. కాంతి శరణ్ ముగ్దల్ (పంకజ్ త్రిపాఠి) కొడుకుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. అతడిని పాఠశాల నుంచి బహిష్కరిస్తుంది యాజమాన్యం. బహిష్కరణకు గురైన తన కొడుకుకు న్యాయం చేయాలని కాంతి శరణ్ ముగ్దల్ కోర్టును ఆశ్రయిస్తాడు. అసలు ఆ వీడియోలో ఏం ఉంది? ఏం కావాలని ముగ్దల్ కోర్టును ఆశ్రయించాడు? ఈ మొత్తం కథలోకి శివుడు (అక్షయ్ కుమార్) ఎలా వచ్చాడు. ఆయన ఏ విధమైన సాయం చేశాడు? అనేది తెలియాలంటే కచ్చితంగా సినిమా చూడాల్సిందే!
ఇటీవల ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ బోర్డ్ కొన్ని సవరణలను సూచించింది. దీంతో మూవీ రిలీజ్ డేట్ మారుతుందని సోషల్ మీడియాలో తీవ్ర దుమారం జరిగింది. సుమారు 20 సీన్లలో మార్పులు చేయాల్సిందేనని, ఈ సీన్లలో ఆడియో, వీడియో కూడా ఉన్నాయని, దీనికి తోడు అక్షయ్ కుమార్ వేసిన శివుడి పాత్రలో కూడా మార్పులు చేయాలని సూచించింది. ఈ సినిమాలో శివుడి రూపం వేరుగా ఉండడంతో శివుడి దూతగా చూపించాలని నిబంధన పెట్టింది. కానీ అనుకున్న సమయానికే రిలీజ్ చేస్తామిన మేకర్స్ ప్రకటించడంతో అక్షయ్ కుమార్ ఫ్యాన్స్ ఆనందంలో ఉన్నారు.