
Passenger slipped : ఇటీవల ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం ఎంతో భయాన్ని సృష్టించింది. రైలు ప్రయాణం అంటేనే దడుసుకునేలా చేసింది. అయితే అప్పుడప్పుడు స్టేషన్లలో జరుగుతున్న చిన్న చిన్న ప్రమాదాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమవుతుంటాయి. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొన్ని సందర్భాల్లో అలా రైలు నుంచి కిందపడిన వారిని స్థానిక రక్షణ సిబ్బంది కాపాడిన వీడియోలు చాలా సందర్భాల్లో బయటకు వచ్చాయి. అయితే ఒక్కోసారి ఇలా స్టేషన్ లో దిగేందుకు ప్రయత్నిస్తూ రైలు కింద పడి ప్రాణాలు కోల్పోయిన వారు ఎందరో ఉన్నారు. దీనికి ప్రధాన కారణం అత్యుత్సాహం.. అవగాహన లేకపోవడం. అయితే ఇలాంటి ఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్ రైల్వేస్టేషన్లో 110 కిలో మీటర్ల వేగంతో వెళ్తున్న పాటలీపుత్ర ఎక్స్ ప్రెస్ రైలు నుంచి ఒక ప్రయాణికుడు జారి పడ్డాడు. దాదాపు 100 మీటర్ల దూరం పాటు అలాగే ప్లాట్ ఫాంపై జారుతూ రైలుతో పాటే ముందుకెళ్లాడు. ఈ చిత్రాలు స్థానిక రైల్వే స్టేషన్ లోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అయితే ఆ యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. చిన్న గాయం కూడా కాలేదు. ఘటన అనంతరం ఆ యువకుడు లేచి నిలబడి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఇటీవల తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.
వేగంగా వస్తున్న రైలు నుంచి దిగాలని, కదులుతున్న రైలు ఎక్కాలని ప్రయత్నించడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. దీంతో ఒక్కోసారి ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. దీనికి కారణం అత్యుత్సాహంతో కొందరు చేస్తుండగా, మరికొందరు అవగాహన లేక ఈ ప్రమాదాల బారిన పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో రైల్వే సిబ్బంది అప్రమత్తత వల్ల ప్రాణాలు నిలబడుతున్నాయి. దీనిపై వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తుంటారు.






