
Traffic assistants : ఒకప్పుడు ఎక్కడైతే ట్రాన్స్ జెండర్లు ట్రాఫిక్ జంక్షన్ల వద్ద వాహనదారులను ఇబ్బంది పెట్టారో ఇప్పుడు అక్కడే ట్రాన్స్ జెండర్లు ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించడానికి పనిచేయబోతున్నారు. గౌరవంగా బ్రతకబోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ట్రాన్స్ జెండర్ లు ఇప్పుడు ట్రాఫిక్ కూడళ్ళ వద్ద కానిస్టేబుల్ గా విధులు మొదలుపెట్టారు. తెలంగాణ ట్రాఫిక్ విభాగం ఎంపిక చేసిన ట్రాన్స్ జెండర్ కానిస్టేబుల్స్ నేటినుండి హైదరాబాద్ ట్రాఫిక్ కూడళ్ల వద్ద విధులు నిర్వర్తిస్తున్నారు.
ఇటీవల ప్రత్యేక నియామకం ద్వారా 39 మంది ట్రాన్స్ జెండర్ లను ఉన్నతాధికారులు ఎంపిక చేశారు. ఎంపికైన వారికి 15 రోజులపాటు ట్రాఫిక్ విధులకు సంబంధించి అధికారులు శిక్షణను ఇచ్చారు. ట్రాఫిక్ మేనేజ్మెంట్, అవుట్ డోర్, ఇండోర్ తో పాటు వాళ్ళు టెక్నికల్ అంశాల పైన వారికి శిక్షణ ఇచ్చారు.
శిక్షణ పూర్తి చేసుకున్న ట్రాన్స్ జెండర్లు నేటి నుంచి ట్రాఫిక్ కంట్రోల్ లో రంగంలోకి దిగారు. అయితే ఆదివారం బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద ఎంపిక చేసిన ట్రాన్స్ జెండర్ లు డ్రిల్ నిర్వహించారు. ఈ డ్రిల్ ను కమిషనర్ సివి ఆనంద్ పరిశీలించారు. ఈ పైలెట్ ప్రాజెక్టు విజయవంతం అయితే మరింత మందిని విధుల్లోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి ఎంతో నమ్మకంతో ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీ వీ ఆనంద్ తెలిపారు.