
Traveler toilet journey : రైల్వేలో కొంత మంది టికెట్ లేకుండా ప్రయాణం చేయడం మనం చూస్తూనే ఉంటాం. టికెట్ కలెక్టర్ నుంచి తప్పించుకునేందుకు వారు వింత వింత పనులు చేస్తారు. కొందరు టికెట్ కలెక్టర్ ఏ కోచ్ లో ఉన్నాడో తెలుసుకొని అతనికి దొరకకుండా తిరుగుతుంటారు. మరికొందరు పడుకున్నట్లు నటిస్తుంటారు. ఇంకొందరైతే టాయిలెట్స్ లో ఉండిపోతారు. ఇదంతా సాధారణంగా చూస్తూనే ఉంటాం.
సాధారణ ప్యాసింజర్ రైలు, ఎక్కువలో ఎక్కువగా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ వరకు వీరు మనకు కనిపిస్తారు. ఎందుకంటే ఆయా రైళ్లకు జనరల్ బోగీకి డోర్ ఓపెన్ చేసి ఉంటుంది కాబట్టి ఒకవేళ టీసీ వస్తే తప్పించుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. కానీ ఇటీవల వచ్చిన వందే భారత్ రైలుకు అలాకాదు. స్టేషన్ నుంచి రైలు ప్రయాణం ప్రారంభమైనప్పటి నుంచి డోర్స్ క్లోజ్ లోనే ఉంటాయి. మరో స్టేషన్ వచ్చే వరకు ఎట్టి పరిస్థితుల్లో తెరుచుకోవు. అప్పట్లో రైలు గురించి వివరించేందుకు అందులోకి ఎక్కిన ఓ యూట్యూబర్ డోర్స్ క్లోజ్ కావడంతో దాదాపు 200 కిలో మీటర్లకుపైగా ప్రయాణం చేయాల్సి వచ్చింది.
ఇదంతా పక్కన పెడితే ఇక్కడో ప్రబద్ధుడు ఏకంగా 270 కిలో మీటర్లు టాయిలెట్ లో ఉండి ప్రయాణం సాగించాడు. కేరళలో జరిగిన ఈ ఘటన గురించి తెలుసుకుందాం. ఆ రాష్ట్రంలో ఉన్న వందేభారత్ రైలులోకి ఒక వ్యక్తి ఎక్కాడు అయితే అతను ఎటువంటి టికెట్ కొనలేదు. ఉత్తర కాసర్ గోడ్ జిల్లాలో ఎక్కిన ఆయన నేరుగా టాయిలెట్ లోకి వెళ్లి డోర్ లాక్ చేసుకున్నాడు. ఎంత పిలిచినా పలకలేదు. గంటల తరబడి లోపలే ఉండిపోయాడు. రైలు దాదాపు 270 కిలో మీటర్లు ప్రయాణించి శోర్ నూర్ స్టేషన్ కు చేరింది. అప్పుడు రైల్వే సిబ్బంది టాయిలెట్ తలుపులు బద్దలు కొట్టి బయటకు తీసుకువచ్చారు.
అతను హిందీ మాట్లాడుతున్నాడని, టికెట్ కొనకుండానే రైలు ఎక్కాడని సిబ్బంది చెప్తున్నారు. అతని గురించి పూర్తి వివరాలు తెలియరాలేదని చెప్పారు. ‘కొంత మంది తరుముకుంటూ రావడంతో తొందరలో రైలు ఎక్కానని టాయ్ లెట్ లోకి వెళ్లి గడియ వేసుకున్నానని’ అతను చెప్తున్నాడని రైల్వే సిబ్బంది తెలిపారు. దీనిపై విచారణ చేపడతామని వారు తెలిపారు.






