
TS EMCET counseling : తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ సోమవారం నుంచి మొదలవనుంది. అర్హులు ముందుగా ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 28 నుంచి అభ్యర్థులు అవసరమైన ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఉన్నత విద్యామండలి ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపింది. కౌన్సెలింగ్‌లో పాల్గొనే కాలేజీలు, ఉండే సీట్ల వివరాలు మాత్రం ఎంసెట్ కౌన్సెలింగ్ విభాగానికి ఇంకా అందలేదని తెలుస్తున్నది.
ఎంసెట్ కౌన్సెలింగ్‌లో దాదాపు 145 కాలేజీలు పాల్గొననున్నాయి. ఈ జాబితాను గుర్తింపు ఇచ్చే యూనివర్సిటీలు ఎంసెట్ కౌన్సెలింగ్‌కు పంపాల్సి ఉంటుంది. వాటిల్లో ఎన్ని సీట్లు ఉన్నాయి? ఏయే బ్రాంచీల్లో సీట్లు ఉన్నాయి? అనే వివరాలు అందించాలి. దీని ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. సకాలంలో ఆప్షన్లు ఇస్తే తప్ప వచ్చే నెల మొదటి వారంలో తొలిదశ సీట్లు వెల్లడించడం సాధ్యం కాదు.
ఈ ఏడాది ఎంసెట్‌కు 1,95,275 మంది హాజరు కాగా 1,56,879 మంది అర్హత సాధించారు. వారంతా ఇప్పుడు కౌన్సెలింగ్ కోసం నిరీక్షిస్తున్నారు.
ఏ బ్రాంచిలో ఎన్ని సీట్లు..
అఖిల భారత సాంకేతిక విద్యామండలి ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం చాలా కాలేజీలు డిమాండ్ లేని కోర్సుల్లో సీట్లు తగ్గించుకొని డిమాండ్ ఉన్న కోర్సుల్లో పెంచుకొనేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నాయి.
పాలిటెక్నిక్ డిప్లొమా ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ పూర్తి..
తెలంగాణలో 2023-24 విద్యాసంవత్సరానికి గాను పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో సీట్ల కేటాయింపు పూర్తయ్యింది. మొత్తం 116 కళాశాలల్లో 29,396 సీట్లకు గాను 21,367 సీట్లు భర్తీ అయ్యాయి. ప్రభుత్వ కళాశాలల్లో 87.44 శాతం, ప్రైవేటు కళాశాలల్లో 60.46 శాతం సీట్లు నిండాయి. సైబర్ సెక్యూరిటీ డిప్లొమా కోర్సుకు సంబంధించిన మొత్తం సీట్లు భర్తీ చేశారు. జౌళి సాంకేతిక డిప్లొమా కోర్సులో 64 సీట్లకు గాను కేవలం 9 మంది విద్యార్థులు మాత్రమే చేరారు.
ప్రభుత్వ కళాశాలల్లో ఇంకా 1,673, ప్రెవేటు కళాశాలల్లో 6,356 చొప్పున మొత్తం 8,029 సీట్లు ఖాళీగా ఉన్నాయని పాలిసెట్ కన్వీనర్ తెలిపారు. ఎన్‌సీసీ, క్రీడా కోటా సీట్లను తుది విడుత కౌన్సెలింగ్ అనంతరం కేటాయిస్తామని, సీట్లు పొందిన విద్యార్థులు జూలై 7 నుంచి 10 వరకు తమ కేటాయించిన కళాశాలల్లో చేరాలని, చేరని వారి సీట్లను రద్దుచేస్తామని స్పష్టం చేశారు. కళాశాలల్లో జూలై 7 నుంచి 14 వరకు రివిజన్ ఉంటుందని, 15 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని వివరించారు.