
Tirumala : తిరుమలలో వన్యప్రాణుల సంచారం, ముఖ్యంగా చిరుతల కదలిక భక్తులకు భయాందోళన కలిగిస్తోంది. అలిపిరి మెట్ల మార్గం, ఘాట్ రోడ్లలో చిరుతలు కనిపించడంతో టిటిడి అప్రమత్తమైంది. భక్తుల భద్రత కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టేందుకు నిర్ణయం తీసుకుంది.
టిటిడి ఈవో శ్యామలరావు నేతృత్వంలో నిర్వహించిన సమీక్షలో అదనపు సిబ్బంది నియామకం, కెమెరా ట్రాప్స్, బయో ఫెన్సింగ్, పెప్పర్ స్ప్రేలు వంటి రక్షణ పరికరాల వినియోగంపై నిర్ణయం తీసుకున్నారు. చిరుతల కదలికలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పెట్రోలింగ్ ఏర్పాటు చేస్తారు.
భక్తులు గుంపులుగా మాత్రమే నడక మార్గంలో వెళ్లాలని సూచించగా, 12 ఏళ్లు లోపు పిల్లలను ఈ మార్గంలో అనుమతించకూడదని ప్రాథమిక నిర్ణయం తీసుకున్నారు. భద్రతను మరింత బలోపేతం చేయడం కోసం టిటిడి, అటవీ శాఖ కలిసి నిరంతర సమీక్షలు నిర్వహించనుంది.






