BJP Alliance : రాబోయే రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఈ మేరకు పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సమాయత్తం అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో పొత్తుల విషయంలో స్పష్టత రావడం లేదు. ఇంతవరకు టీడీపీ జనసేన కూటమి విషయంలో కూడా ఇంకా సీట్ల సర్దుబాటుపై క్లారిటీ లేదు. దీంతో సీట్ల పంపకంతో నేతల మధ్య ఎలాంటి వైరుధ్యాలు ఏర్పడతాయో తెలియడం లేదు.
టీడీపీ జనసేన కూటమిలో చేరాలా లేదా అనేది బీజేపీ కూడా నిర్ణయించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి అమిత్ షా ప్రకటన పార్టీల్లో ఆశలు రేకెత్తిస్తోంది. ఉత్తరాదిలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది కానీ దక్షిణాదిలో మాత్రం పొత్తులు పెట్టుకుంటుందని ప్రకటించడంతో పార్టీల్లో ఆసక్తి కలుగుతోంది. పొత్తులకు సై అనడంతో బలం పెరుగుతుందని భావిస్తున్నాయి.
టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ ఎంట్రీ ఇస్తుందా? అనేది తేలడం లేదు. పొత్తులుంటాయని చెప్పడంతో టీడీపీ జనసేన పార్టీలు బీజేపీని ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలుస్తోంది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పొత్తులపై నేతలు బహిరంగంగా మాట్లాడరాదని సూచనలు చేశారు. దీంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పొత్తులపై త్వరలోనే నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని అనుకుంటున్నారు. టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి బీజేపీతో పొత్తు ఖరారు కాలేదని స్పష్టం చేశారు. బీజేపీతో పొత్తు కుదిరితే టీడీపీనే ఎక్కువ సీట్లు త్యాగం చేయాల్సిన అవసరం వస్తుందని అంటున్నారు. రాజ్యాధికారమే లక్ష్యంగా పార్టీలు ముందుకు కదులుతున్న వేళ పొత్తులు ఖరారైతే పరిణామాలు మారే అవకాశాలున్నాయని చెబుతున్నారు.