Jamili Elections : భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం చేపట్టినప్పటి నుంచి జమిలి తీసుకురావాలని నిశ్చయంతో ఉంది. ఇందులో భాగంగా చాలా సార్లు పార్లమెంట్ లో ఈ విషయం లేవనెత్తింది. జమిలితో ఖర్చు, శ్రమ చాలా వరకు తగ్గుతాయని చెప్తోంది. కానీ విపక్షాలు మాత్రం దీనిని వ్యతిరేకిస్తూ వచ్చాయి. పదేళ్లు పూర్తయిన తర్వాత మూడో సారి పార్టీ పగ్గాలు చేపట్టిన బీజేపీ ఈ సారి జమిలి తీసుకురావల్సిందేనని నిశ్చయంతో ఉంది.
జమిలికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు (జమిలి) నిర్వహణకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రూపొందించిన నివేదికకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. శీతాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు, హై కోర్టు న్యాయమూర్తులతో పాటు 32 పార్టీలు ప్రముఖ న్యాయమూర్తులు ఈ విధానాన్ని సమర్థించారు. 18 రాజ్యాంగ సవరణలను ప్యానల్ సిఫారసు చేసింది. దీంతో పాటు చంద్రయాన్- 4కు, గగన్ యాన్, చంద్రయాన్ విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ అమలు చేయడం ద్వారా ఎన్నికల ప్రక్రియ సులభతరం అవుతుంది. దీని ద్వారా వేగవంతమైన ఆర్థికవృద్ధికి దారితీస్తుందని ప్యానల్ పేర్కొంది. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ, పంచాయతీలకు మూడు స్థాయిల్లో ఎన్నికలు నిర్వహిస్తే శ్రమ, ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. కార్మికులు సైతం ఓటేసేందుకు వారి వారి సొంత గ్రామాలకు వెళ్లేందుకు ఇబ్బంది ఉండదని చెప్తోంది.
ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం హయాంలోనే జమిలి అమలు చేసి తీరుతామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. గతనెల స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రధాని ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ జమిలి గురించి ప్రస్తావించారు. ఏటా ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయని, దీని ద్వారా దేశ పురోగతిపై వేటు పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీని నుంచి బయటపడాలంటే జమిలి మాత్రమే పరిష్కారం అన్నారు. ఈ దిశగా అన్ని రాష్ట్రాలు కలిసి నడవాలని పిలుపునిచ్చారు. ఎన్డీఏ 3.0లోనే జమిలి అమల్లోకి వస్తుందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఆమోదం.. ఆచరణాత్మకం కాదు: మల్లికార్జున్ ఖర్గే..
కాంగ్రెస్‌తో సహా 15 పార్టీలు ఈ విధానాన్ని వ్యతిరేకించాయి. ఈ ప్రతిపాదన ఆచరణాత్మమైంది కాదని కాంగ్రెస్ పేర్కొంది. దీనిపై ఏఐసీసీ అధినేత మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ ‘ఇది ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం. దీన్ని ప్రజలు అంగీకరించరు’ అన్నారు.